Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయంతో ముగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 110 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది ఆరో విజయం. 13 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. లక్నో జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోతే అప్పుడు సన్‌రైజర్స్ ఆరో స్థానంతోనే సీజన్‌ను ముగిసింది. ఒకవేళ లక్నో తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు సన్‌రైజర్స్ ఏడో స్థానంలో నిలుస్తుంది. ఇక హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన కోల్‌కతా ఎనిమిదో స్థానంతో సీజన్‌ను ముగించింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (105 నాటౌట్; 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (76; 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), అభిషేక్ శర్మ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా విఫలమైంది. 18.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్ నరైన్ (31 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మనీశ్ పాండే (37; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబెలు తలా మూడు వికెట్లు తీశారు.
ఇక ఈ మ్యాచ్‌లో విజయం, సీజన్ లో తమ ఆటతీరుపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడాడు.ఈ సీజన్‌కు ఇది అద్భుతమైన ముగింపు అని చెప్పుకొచ్చాడు. సీజన్ ఆఖరిలో కొన్ని మ్యాచ్‌ల్లో చాలా బాగా ఆడామని, అన్ని చక్కగా కుదిరాయన్నాడు. ఇలాంటి బ్యాటింగ్ చూడడానికి ఓ బౌలర్‌గా తనకు చాలా భయంగా ఉందన్నాడు.
‘మా ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే మేము సీజన్ ఆరంభంలో అలా ఆడి ఉండకూడదు. ఖచ్చితంగా మేము ఫైనల్స్‌కు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి వికెట్ ఉంటే.. మేము ఈజీగా 250 నుంచి 260 పరుగులు చేస్తాము. అయితే.. కొన్ని సార్లు మేము 170 పరుగులు కూడా చేయలేకపోయాము. ఈ సీజన్‌లో చాలా మందికి అవకాశాలు వచ్చాయి. జట్టును ఎంచుకునేటప్పుడు మేము ప్రతీది పరిశీలిస్తాము. గాయాల వల్ల చాలా మంది ఆటగాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. ఈ సీజన్‌లో మేము 20 మంది ఆటగాళ్లను ఉపయోగించుకున్నాము.’ అని కమిన్స్ తెలిపాడు.