Pat Cummins Doubtful For T20 World Cup 2026
Pat Cummins : ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. ఈ మెగాటోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహకాలు కూడా ప్రారంభించాయి. అయితే.. ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మెగాటోర్నీలో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.
‘ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నాను, అతను అక్కడ ఉంటాడో లేదో, నేను నిజంగా చెప్పలేను. ప్రస్తుతానికి పరిస్థితి చాలా దిగులుగా ఉంది. మేము ఆశాజనకంగా ఉన్నాము.’ అని ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపాడు.
Deepti Sharma : శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్.. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించేనా?
యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులు గల బృందంలో కెప్టెన్ పాట్ కమిన్స్ లేడు. యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న అతడు మూడో టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. ఆరు వికెట్లు తీసి తమ జట్టు 3-0 యాషెస్ సిరీస్ ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. నాలుగో టెస్టుతో పాటు చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌కు సైతం అతడు ఆడడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
జూలైలో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్ సమయంలో పాట్ కమిన్స్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు జట్టు నుంచి తప్పుకుని పునరావాసం పొందాడు. ఆ తరువాత అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లోనే కమిన్స్ బరిలోకి దిగాడు.
‘ప్రస్తుతం మేము సిరీస్ గెలిచాం. మా లక్ష్యం అదే. కమిన్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడి విషయంలో మేం ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మిగిలిన సిరీస్‌లో అతడు ఎలాంటి పాత్ర పోషించడు. అతని పునరాగమనం గురించి మేము చాలా కాలంగా చర్చించుకున్నాము. ఈ నిర్ణయం పట్ల పాట్ కూడా సంతోషంగానే ఉన్నాడు.’ అని డొనాల్డ్ తెలిపాడు.
డొనాల్డ్ మాటలను బట్టి చూస్తుంటే కమిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని అర్థమవుతోంది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 11న కొలొంబో వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆల్ రౌండర్ మిచ్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఈ మెగాటోర్నీలో ఆడనుంది. ఒకవేళ కమిన్స్ టీ20 ప్రపంచకప్‌కు దూరం అయితే అది ఆసీస్ కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.