T20 World Cup
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ – 2026లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లాదేశ్ జట్టును వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్ జట్టు బరిలోకి దిగుతుంది.
Also Read : T20 World Cup : బంగ్లాదేశ్ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు.. ఆ దేశం ఎన్నికోట్లు నష్టపోతుందో తెలుసా?
భారతదేశంలో పర్యటించిన సమయంలో జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నోవిధాలుగా ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా బీసీబీ తన మొండివైఖరిని వీడకపోవడంతో ఆ జట్టును టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ ఐసీసీ ప్రకటించింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టును తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా.. కేవలం పాకిస్థాన్ మాత్రం బంగ్లాదేశ్ జట్టుకు మద్దతు పలికింది. దీంతో వేటు లాంఛనంగానే మారింది.
టీ20 ప్రపంచకప్‌లో షెడ్యూల్ ప్రకారం పాల్గొనడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. భారతదేశంలో జరిగే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని డిమాండ్ చేసింది. తమ నిర్ణయాన్ని గౌరవించకుంటే టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటామని చెప్పింది. అయితే, భారతదేశంలో పర్యటించే సమయంలో బంగ్లాదేశ్ జట్టు భద్రతకు పూర్తిహామీ ఇస్తున్నట్లు బీసీసీఐతోపాటు ఐసీసీ పేర్కొంది. కానీ, బంగ్లాదేశ్ తన మొండివైఖరిని వీడకపోవటంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంలో మొదటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అండగా నిలుస్తూ వచ్చింది. తాజాగా.. బంగ్లాదేశ్ జట్టుపై ఐసీసీ వేటు వేయడంతో పాకిస్థాన్ సైతం టోర్నీ నుంచి తప్పుకుంటుందన్న వాదన క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ విషయంపై ఆ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి స్పందించాడు.
బంగ్లాదేశ్ కు ఐసీసీ అన్యాయం చేసిందని నఖ్వి అభిప్రాయపడ్డాడు. భారత్ కు బంగ్లా జట్టును పంపకూడదన్న నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయి. ఇంతకుముందు భారత్, పాకిస్థాన్ ల కోసం ఐసీసీ వేదికలను మార్చినప్పుడు.. బంగ్లాదేశ్ కోసం అలా ఎందుకు చేయరని నఖ్వి ప్రశ్నించాడు. అలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ఇక్కడ ఒక దేశం (భారత్ ను ఉద్దేశించి) అన్నింటినీ నిర్దేశిస్తోందని నఖ్వి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. అయితే, పాకిస్థాన్ కూడా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటుందా అని ప్రశ్నించగా.. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోధార్యం. మా ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే సలహా కోరతాం. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని నఖ్వి చెప్పాడు.