PCB chief Mohsin Naqvi ran away with Asia Cup trophy
Mohsin Naqvi : ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. అయితే.. పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi)చేతుల మీదుగా ఆసియాకప్ ట్రోఫీని అందుకోకూడదని భారత్ నిర్ణయం తీసుకుంది. యూఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుంటామని వెల్లడించింది.
దీనిపై ఆగ్రహించిన నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్ రూమ్‌కు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు.. స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. అతడికి అలా చేసే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నఖ్వీ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
IND vs PAK : పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కండకావరం.. రన్నరప్ చెక్‌ను విసిరేశాడు..
‘పాకిస్తాన్ ప్రభుత్వంలో నఖ్వీ ఓ సీనియర్ నాయకుడు. అందుకనే ఏసీసీ ఛైర్మన్ అయినప్పటికి కూడా ఆయన చేతుల మీదుగా కప్పును తీసుకోవద్దని మేం నిర్ణయించుకున్నాం. ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోం అని అన్నామంటే మాకు కప్పు వద్దని కాదు. వేరే వాళ్ల చేతుల మీదుగా తీసుకోవాలని అనుకున్నాం.’ అని సైకియా తెలిపారు.
‘అయితే.. నఖ్వీ మాత్రం తనతో పాటు ట్రోఫీని, మెడల్స్‌ను హోటల్ రూమ్‌కు తీసుకుని వెళ్లిపోయాడు. అతడికి ఆ హక్కు ఎక్కడిది. ఇదంతా పిల్ల చేష్టలలా అనిపిస్తుంది. భారత్ అద్భుతంగా ఆడింది. అయినప్పటికి నఖ్వీ మనకు ట్రోఫీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కనిపించాడు. అందుకనే అలా చేశాడు. దీనిపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ట్రోఫీని, మెడల్స్‌ను త్వరలోనే పంపిస్తారని భావిస్తున్నాము.’ అని సైకియా తెలిపారు.
BCCI : దటీజ్ బీసీసీఐ.. టీమ్ఇండియాకు 21 కోట్ల ప్రైజ్‌మనీ.. ‘3-0’ అంటూ పాక్ ఇజ్జత్ తీసింది..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (69*) హాఫ్ సెంచరీ బాదాడు. శివమ్ దూబె (33), సంజూ శాంసన్ (24) రాణించారు. పాక్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ మూడు వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ లు చెరో వికెట్ సాధించారు.