Prominent Indian cricketer advised him to retire says Karun Nair
దాదాపు ఎనిమిదేళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు కరుణ్ నాయర్. ఇంగ్లాండ్‌తో జూన్ 20 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు టీమ్ఇండియా తరుపున రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు కరణ్ నాయర్.
ఓ ప్రముఖ క్రికెటర్ తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని సూచించినట్లు చెప్పాడు. ఆర్థిక భరోసా కోసం ఫ్రాంఛైజీ టీ20 లీగ్‌లు ఆడుకోమని సలహా ఇచ్చినట్లు తెలిపాడు. అయినప్పటికి సదరు క్రికెటర్ మాట వినని నాయర్.. దేశవాళీల్లో సత్తా చాటి, తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.
‘నాకు ఇంకా గుర్తు ఉంది. ఓ ప్రముఖ భారత క్రికెటర్ నాకు రెండేళ్ల క్రితం ఫోన్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని సూచించాడు. ఇక ఆర్థిక భరోసా కోసం విదేశీ టీ20 లీగుల్లో ఆడమని సలహా ఇచ్చాడు. అయితే.. అతడు చెప్పినట్లు చేయడం చాలా ఈజీ. కానీ లక్ష్యం అది కాదు. టీమ్ఇండియాకు ఆడడమే. ఇప్పుడు నేను మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నా.’ అని కరుణ్ నాయర్ తెలిపాడు.
ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్, ఇండియా ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌లో అతడు డబుల్ సెంచరీ చేశాడు. ఇక ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. 2023, 2024 కౌంటీ ఛాంపియన్ షిప్ సీజన్లలో నార్తాంప్టన్ షైర్‌కు ఆడిన నాయర్ 10 మ్యాచ్‌ల్లో 736 పరుగులు చేశాడు. ఇందులోనూ ఓ ద్విశతకం సాధించాడు.
ఈ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కరుణ్ నాయర్ కీలకం అవుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.