ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర 105 బంతుల్లో 112 పరుగులు బాదాడు.
అసలు, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? అని మొదట అతడిపై డౌట్ ఉండేది. ఎందుకంటే, కొన్ని రోజుల క్రితం ముక్కోణపు సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర గాయపడ్డాడు.
అప్పట్లో రచిన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాక్ బ్యాటర్ కుష్ దిల్ షా షాట్ కొట్టగా బౌండరీ వద్ద రచిన్ బంతిని ఆపే క్రమంలో అది అతడి ముఖానికి బలంగా తగిలి, రక్తస్రావమైంది. దీంతో అతడిని డగౌట్‌లోకి తీసుకెళ్లి, చివరకు ఆసుపత్రిలో చేర్చారు.
ఆ గాయం కారణంగా ఛాంపియన్ ట్రోఫీలో రచిన్ ఆడతాడా అన్న సందేహం ఉండేది. అటువంటి స్థితి నుంచి కోలుకుని, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడి ఏకంగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డునే బద్దలు కొట్టాడు రచిన్ రవీంద్ర.
Also Read: సెమీఫైనల్‌లో టీమిండియాతో ఆడే జట్టు ఏది? పాయింట్ల పట్టికలో ఏవి టాప్‌లో ఉన్నాయి?
25 ఏళ్ల వయసులో 4 సెంచరీలు
న్యూజిలాండ్ 237 పరుగుల ఛేజింగ్‌లో రచిన్ రవీంద్ర బాదిన శతకం.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అతడికిది నాలుగోది. రచిన్ రవీంద్ర వయసు 25 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే అత్యధిక సెంచరీలు కొట్టిన యంగెస్ట్ ప్లేయర్‌గా అతడు రికార్డు సృష్టించాడు.
సచిన్ టెండూల్కర్ మీద 27 ఏళ్లుగా ఉన్న రికార్డును అతడు బద్దలుకొట్టాడు. 25 సంవత్సరాల వయస్సులో సచిన్ టెండూల్కర్ ఐసీసీ వన్డే ఈవెంట్లలో మూడు సెంచరీలు చేశారు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడానికి రచిన్ రవీంద్రకు కేవలం 11 ఇన్నింగ్స్ మాత్రమే పట్టింది.
ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన ఈ 11 ఇన్నింగ్స్‌లో రచిన్ మొత్తం 690 పరుగులు బాదాడు. 69 సగటుతో, 106.48 స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు చేశాడు. మరోవైపు, సచిన్ టెండూల్కర్ ఇదే 25 ఏళ్ల వయసులో మొత్తం 16 ఇన్నింగ్స్‌లలో 68.21 సగటుతో 955 పరుగులు చేశారు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి.