Rahul Dravid : నేనింకా సంత‌కం చేయ‌లేదు.. కాంట్రాక్ట్ పొడిగింపు పై రాహుల్ ద్ర‌విడ్‌

Rahul Dravid contract extension : త‌న కాంట్రాక్ట్ పొడిగింపుపై ద్ర‌విడ్ గురువారం స్పందించాడు.

Rahul Dravid

భార‌త జ‌ట్టు హెచ్ కోచ్ గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాల‌న్ని పొడిగిస్తున్న‌ట్లు బుధ‌వారం భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా వెల్ల‌డించింది. అయితే.. త‌న కాంట్రాక్ట్ పొడిగింపుపై ద్ర‌విడ్ గురువారం స్పందించాడు. తానింకా కాంట్రాక్ట్ పొడిగింపు ప‌త్రాల‌పై సంత‌కం చేయ‌లేద‌ని చెప్పాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 పైన‌ల్ మ్యాచ్ అనంత‌రం హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప‌ద‌వి కాలం ముగిసింది. అయితే.. ఫైన‌ల్ మ్యాచ్ మిన‌హా మిగిలిన టోర్నీ అంత టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. వ‌రుస‌గా 10 మ్యాచుల్లో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ద్ర‌విడ్ పై విశ్వాసం ఉంచిన బీసీసీఐ అత‌డితో స‌హాయక సిబ్బంది అంద‌రి కాంట్రాక్ట్‌ల‌ను పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే.. ఎంత కాలానికి అన్న సంగ‌తి మాత్రం చెప్ప‌లేదు.

పత్రాలు రానివ్వండి..

దీనిపై రాహుల్ ద్ర‌విడ్‌ను ప్ర‌శ్నించ‌గా కాంట్రాక్ట్ పొడిగింపు అనేది ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే.. నేను ఇప్ప‌టి వ‌ర‌కు దానిపై సంత‌కం చేయ‌లేదు. బీసీసీఐ నుంచి అధికారికంగా పేప‌ర్లు వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల‌న్నాడు. టీమ్ఇండియాతో చేసిన గ‌త రెండేళ్ల ప్ర‌యాణం గురించి మాట్లాడుతూ అద్భుతం అని చెప్పాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో నెల‌కొల్పిన సంస్కృతికి గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు తెలిపాడు. జ‌ట్టులో గొప్ప నైపుణ్యం, ప్ర‌తిభ ఉన్నాయ‌న్నారు. స‌న్నాహాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, స‌త్ఫ‌లితాలు సాధించిన‌ట్లు చెప్పుకొచ్చాడు.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. జాబితాను ప్ర‌క‌టించిన ఐసీసీ

ఈ కాలంలో త‌న‌పై నమ్మకం ఉంచినందుకు, త‌న‌ దార్శనికతను ఆమోదించడంతో పాటు సహాయాన్ని అందించినందుకు బీసీసీఐకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చేందుకు కుటుంబానికి దూరంగా గ‌డ‌పాల్సి వ‌చ్చింద‌న్నాడు. త‌న కుటుంబ స‌భ్యులు చేసిన త్యాగాల‌ను గుర్తు చేసుకున్నాడు. తెర వెనుక వారి పాత్ర అమూల్య‌మైన‌ది చెప్పాడు. కొత్త స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకే కృషి చేస్తామ‌ని రాహుల్ ద్ర‌విడ్ అన్నాడు.

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌తో టీమ్ఇండియా హెచ్‌కోచ్‌గా ద్ర‌విడ్ రెండోసారి బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టనున్నాడు. డిసెంబ‌ర్ 10 నుంచి ఈ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. ఆ త‌రువాత‌ స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. అనంత‌రం జూన్‌లో వెస్టిండీస్‌, యూఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో టీమ్ఇండియా పాల్గొన‌నుంది.

ఆసియా క‌ప్ మినహా..

2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ర‌విశాస్త్రి స్థానంలో రెండు సంవ‌త్స‌రాల కాల ప‌రిమితితో రాహుల్ ద్ర‌విడ్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు అందుకున్నాడు. ఆ స‌మ‌యంలో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ చీఫ్ ఉన్న ద్ర‌విడ్‌ను మాజీ కెప్టెన్‌, అప్ప‌టి బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఒప్పించి కోచింగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. ద్ర‌విడ్ మార్గ‌నిర్దేశంలో టీమ్ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించింది.

Team India : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు భార‌త టీ20, టెస్టు, వ‌న్డే జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌ .. టెస్టుల‌కే ప‌రిమిత‌మైన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ

వ‌న్డేలు, టెస్టులు, టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా నిలిచింది. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 సెమీస్‌, డ‌బ్ల్యూటీసీ 2023 పైన‌ల్‌, వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2023 ఫైన‌ల్ మ్యాచుల్లో ఓడిపోయింది. కాగా ఆసియా క‌ప్ 2023ని మాత్రం సొంతం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు