Rajasthan Royals CEO Jake Lush McCrum parts ways
Rajasthan Royals : ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన చేసింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలో సమూల ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక పదవుల్లో ఉన్న వారిని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తొలుత ఆ ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్, ఆతర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లు తమ తమ పదవుల నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆ జట్టు సీఈఓ జేక్ లష్ మెక్‌క్రమ్ జట్టును వీడినట్లు క్రిక్‌బజ్ తెలిపింది.
Asia cup 2025 : నేడే భారత్ తొలి మ్యాచ్.. జోరు మీదున్న సూర్య బృందం.. తుది జట్టు ఇదే.. ఇక రచ్చరచ్చే..
ఇంగ్లాండ్‌కు చెందిక మెక్‌క్రమ్ 2018లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)లో చేరాడు. వివిధ పాత్రలో పని చేశాడు. 2021లో 28 ఏళ్ల వయసులో రాయల్స్ సీఈఓగా బాధ్యతలను అందుకున్నాడు. తాజాగా అతడు సీఈఓ పదవికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన SA20 వేలంలో రాజస్థాన్ రాయల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన Paarl Royals టేబుల్ వద్ద జేక్ కనిపించలేదు. దీంతో ఆయన రాజీనామా వార్తలకు ఇది బలాన్ని చేకూర్చినట్లైంది.
మరోవైపు ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సైతం ఆ జట్టును వీడే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ట్రేడ్ డీల్ ద్వారా లేదంటే వేలంలోకి వెళ్లవచ్చునని అంటున్నారు. శాంసన్ నిర్ణయం ద్రవిడ్‌ను కలవరపెట్టిందని, అతడు ప్రధాన కోచ్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలలో ఇది ఒకటి అని పీటీఐ తెలిపింది.
రాయల్స్ యాజమాన్యం ఇంత మంది తప్పిస్తున్నా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న కుమార సంగక్కరను మాత్రం కొనసాగించనున్నట్లు సమాచారం.
కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుండడంతో అసలు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలో ఏం జరుగుతోందనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెంత మంది ఆర్ఆర్‌ను వీడుతారో.