రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్ఆర్ జట్టును వీడనున్నాడని, ఐపీఎల్ 2026లో అతడు వేరే జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడని అంటున్నారు. ఆర్ఆర్ కెప్టెన్‌గా నాలుగు సీజన్ల పాటు అతడు వ్యవహరించాడు. 2022లో అతడు జట్టును ఫైనల్ కు తీసుకువెళ్లాడు. కాగా.. 2025 సీజన్‌లో రాజస్థాన్ దారుణ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే.. రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సంజూ శాంసన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో సంజూ శాంసన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఎంపికైన తరువాత అతడి ఆట, అతడు చూసే దృక్పథం ఎలా మారిందో వివరించాడు.
నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తరువాత తన ఆలోచన ఎంతో మారిందన్నాడు. ఏదైన అంశాన్ని చూసే విధానంలో ఎంతో మార్పు వచ్చిందన్నాడు. క్రికెట్ లో విజయం సాధించడానికి ఓ మార్గం అంటూ లేదు. ఒక్కొక్కరు ఒక్కొ విధంగా సక్సెస్ అవుతారు. అలాంటి వారిని ప్రశ్నించడం కంటే వెనకుండి ప్రోత్సహించడం తనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు షిమ్రాన్ హెట్‌మయర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. అతడు చాలా ఆలస్యంగా నిద్ర లేస్తాడని అన్నారు. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఉంది అంటే అతడు సాయంత్రం 5 గంటలకు నిద్ర లేస్తాడని శాంసన్ చెప్పాడు. ఇక జట్టు సమావేశాల్లోనూ అతడు నిద్రపోతాడని చెప్పుకొచ్చాడు. అయితే.. అతడు మైదానంలోకి దిగితే మాత్రం కీలకమైన పరుగులు చేస్తూ జట్టు ను గెలిపిస్తాడని అన్నాడు.