Courtesy BCCI
ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్‌సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నాడు.
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ లపై ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరి బౌలింగ్ వల్లే ఆర్‌సీబీ విజయం సాధించిందని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు అద్భుతంగా బంతులు వేశారని మెచ్చుకున్నాడు.
గెలవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ జైత్రయాత్ర ఇలాగే కొనసాగుతే ఇంకా బాగుంటుందన్నాడు. ఇక కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ నాయకత్వం అనేది కాస్త ఒత్తిడిగానే ఉందన్నాడు. మ్యాచ్ రోజు తమకు కలిసొచ్చిందన్నాడు.
IPL 2025: అయ్యో రసూల్.. అనుకుందొకటి.. అయిందొకటి.. బిగ్ షాకిచ్చిన సుయాశ్.. వీడియో వైరల్
సుయాశ్ శర్మ పరుగులు ఇవ్వడం గురించి స్పందిస్తూ.. దాన్ని తాను పట్టించుకోలేదన్నాడు. అతడు తమ ప్రధాన వికెట్ టేకింగ్ బౌలర్ అని చెప్పుకొచ్చాడు. అందుకనే అతడికి అండగా నిలిచామని చెప్పుకొచ్చాడు. 13వ ఓవర్ తరువాత సుయాశ్, కృనాల్ చాలా చక్కగా బౌలింగ్ చేశారని చెప్పాడు.
అతడు ఉండడం అదృష్టం..
ఇక కోహ్లీ లాంటి ఆటగాడు ఉండడం తమ అదృష్టం అని అన్నాడు. ఈ సీనియర్ ఆటగాడి నుంచి కుర్రాళ్లుగా తాము ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నామన్నాడు. ఇక తాను హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ ను ముందే అనుకుని ఆడినట్లుగా తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ రహానే (56; 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. సునీల్ నరైన్ (44; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం విరాట్ కోహ్లీ (59 నాటౌట్; 36బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), సాల్ట్ (56; 31బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) దంచికొట్టగా కెప్టెన్ రజత్ పాటిదార్ (34; 16 బంతులు ) మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మూడు వికెట్లు తీసి ఆర్‌సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.