ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిరీక్షణ ఫలించింది. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఈ సీజన్‌లో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కప్పును ముద్దాడింది. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. ప్రస్తుతం రజత్ పాటిదార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్‌సీబీ ఐపీఎల్ కప్పును అందించిన సారథిగా రజత్ రికార్డులకు ఎక్కాడు.
ఇదిలా ఉంటే.. గతంలో రజత్ పాటిదార్ మాట్లాడిన మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆర్‌సీబీ ఇచ్చిన మాట తప్పిందని, దీంతో మళ్లీ ఆ జట్టు ఆడకూడని అనుకున్నట్లు రజత్ చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో ఆర్సీబీ పాడ్ కాస్ట్‌తో మాట్లాడుతూ రజత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇది 2022లో జరిగిన ఘటన అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 వేలంలో తనను తీసుకుంటామని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మాట ఇచ్చిందని తెలిపాడు. ఆ సీజన్ కోసం సిద్ధంగా ఉండాలని ఫోన్ చేసి మరీ చెప్పిందన్నాడు. మరోసారి ఆర్‌సీబీ ఆడబోతున్నానని తాను ఎంతో సంతోషపడినట్లు చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే.. ఆర్‌సీబీ ఆ వేలంలో తనను తీసుకోలేదన్నాడు. దీంతో తాను ఎంతో బాధపడ్డానని అన్నాడు. ఇక చేసేది లేక తాను స్థానిక మ్యాచ్‌లు ఆడుతుండగా.. మరోసారి ఆర్‌సీబీ నుంచి ఫోన్ వచ్చిందన్నాడు.
లవ్‌నిత్ సిసోడియా గాయపడ్డాడని, అతడి స్థానంలో నన్ను తీసుకుంటున్నట్లుగా చెప్పారు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో ఆర్‌సీబీ ఆడాలని నాకు లేదు. ఎందుకంటే ఇంజూరీ రీప్లేస్‌మెంట్‌గా వెళితే తుది జట్టులో ఎక్కువగా ఛాన్స్‌లు రావు. డగౌట్‌లోనే కూర్చోవాలి. డగౌట్ కూర్చోని మ్యాచ్‌లు చూడడం నాకు ఇష్టం లేదు. అని రజత్ తెలిపాడు.