IPL 2025 : ఐపీఎల్ విజేత‌గా ఆర్‌సీబీ.. కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఫ్యాన్‌కు ఒక్క‌టే చెబుతున్నా..

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 18 ఏళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది.

IPL 2025 : ఐపీఎల్ విజేత‌గా ఆర్‌సీబీ.. కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఫ్యాన్‌కు ఒక్క‌టే చెబుతున్నా..

Courtesy BCCI

Updated On : June 4, 2025 / 8:07 AM IST

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 18 ఏళ్ల నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఎట్ట‌కేల‌కు ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఆర్‌సీబీ మ‌ట్టిక‌రిపించి విజేత‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3 ఫోర్లు) రాణించ‌గా, మ‌యాంక్ అగ‌ర్వాల్ (24), ర‌జ‌త్ పాటిదార్ (26), లియామ్ లివింగ్ స్టోన్ (25), జితేశ్ శ‌ర్మ (24)లు త‌లా ఓ చేయి వేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, జేమిస‌న్ లు చెరో మూడు వికెట్లు తీశారు. విజ‌య్ కుమార్ వైశాక్‌, చాహ‌ల్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఐపీఎల్-2025 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

ఆ త‌రువాత శ‌శాంక్ సింగ్ (61 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), జోష్ ఇంగ్లిష్ (39; 23 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) రాణించినా మిగిలిన బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్, కృనాల్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు. య‌శ్ ద‌యాల్‌, జోష్ హేజిల్‌వుడ్‌, రొమారియో షెపర్డ్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌ విజేత‌గా నిల‌వ‌డంపై రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. అభిమానులారా ఈ సారి క‌ప్పు సాధించాం అంటూ భావోద్వేగానికి లోన‌య్యాడు. విరాట్ కోహ్లీ, త‌న‌తో పాటు 18 ఏళ్లు జ‌ట్టుకు అండ‌గా నిలిచిన అభిమానుల‌కు ఈ విజ‌యం ఎంతో ప్ర‌త్యేక‌మైనద‌ని చెప్పుకొచ్చాడు.ఇక ఫైన‌ల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. బౌల‌ర్ల అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న వ‌ల్లే గెలిచామ‌న్నాడు. జ‌ట్టులోని ప్ర‌తి ఒక్క‌రు స‌మిష్టిగా రాణించార‌న్నాడు.

IPL 2025 Final: ఫైనల్లో ఓటమి తరువాత శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. అతని వల్లే ఓడాం..

‘నాతో పాటు విరాట్ కోహ్లీకి, 18 ఏళ్లుగా జ‌ట్టుకు అండ‌గా ఉంటున్న ఫ్యాన్స్ అంద‌రికి ఈ విజ‌యం చాలా చాలా స్పెష‌ల్. ఈ గెలుపు క్రెడిట్ ఫ్యాన్స్‌దే. క్వాలిఫ‌య‌ర్‌-1లో విజేత‌గా నిలిచిన త‌రువాత టైటిల్ గెలుస్తామ‌నే న‌మ్మ‌కం వ‌చ్చింది. ఇక ఫైన‌ల్ పిచ్ పై 190 ప‌రుగులు మంచి స్కోరు అని అనుకున్నాము. ఎందుకంటే ఈ వికెట్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇక బౌల‌ర్లు ప్ర‌ణాళిక‌ల‌కు త‌గ్గ‌ట్లుగా బౌలింగ్ చేసి ఫ‌లితం రాబ‌ట్టారు. అత‌డు (కృనాల్) వికెట్ టేక‌ర్ బౌల‌ర్‌. నేను ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా, నేను అత‌డి వైపు చూస్తాను.’ అని ర‌జ‌త్ అన్నాడు.

స్పిన్న‌ర్ సుయాశ్ శ‌ర్మ కూడా ఈ సీజ‌న్ అంత‌టా చాలా బాగా బౌలింగ్ చేశాడ‌ని చెప్పాడు. ఇక పేస‌ర్లు భువీ, య‌శ్ ద‌యాల్‌, జోష్ హేజిల్‌వుడ్‌, రొమారియో అద్భుతంగా బౌలింగ్ చేశార‌ని తెలిపాడు. రొమారియా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రెండు మూడు ఓవ‌ర్లు వేసి త‌న వంతు పాత్ర పోషించాడ‌న్నారు. విరాట్ కోహ్లీ వంటి దిగ్గ‌జ ఆట‌గాడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం త‌న‌కు ద‌గ్గిన గొప్ప గౌర‌వం అని అన్నాడు. కెప్టెన్‌గా తాను ఎంతో నేర్చుకున్నాన‌ని తెలిపాడు. కోహ్లీ, ఫ్యాన్స్‌, మేనేజ్‌మెంట్, స‌పోర్ట్ స్టాఫ్‌కు ధ‌న్య‌వాదాలు. ఇక ఫ్యాన్స్‌కు ఒక మాట చెప్పాల‌నుకుంటున్నా.. “ఈ సాలా క‌ప్ న‌మ్దూ.(Ee sala Cup Namdu)” అని ర‌జ‌త్ పాటిదార్ అన్నాడు.