Virat Kohli : ఇంపాక్ట్ ప్లేయర్‌గా అస్సలు ఆడను.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్‌లో చివరి రోజు వరకు..
ఈ గెలుపు తనతో పాటు ఫ్యాన్స్‌కు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు విరాట్ కోహ్లీ.

pic credit @ RCB
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 18వ సీజన్‌లో విజేతగా నిలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్‌సీబీకి ఆడుతూ వస్తున్న విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైయ్యాడు. ఈ గెలుపు తనతో పాటు ఫ్యాన్స్‌కు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. ఆర్‌సీబీ మాజీ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, క్రిస్‌గేల్ తో కలిసి సంబురాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3 ఫోర్లు) టాప్‌స్కోరర్. ఆ తరువాత శశాంక్ సింగ్ (61 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిష్ (39; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ గెలుపు ఫ్యాన్స్, జట్టుతో పాటు తనకు ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు. ’18 సంవత్సరాలు గడిచాయి. ఈ జట్టుకు నా యవ్వనాన్ని, నా ఉత్సాహాన్ని, నా అనుభవాన్ని ఇచ్చాను. ప్రతి సీజన్‌లో కప్పు గెలవడానికే ప్రయత్నించాను. ఏం చేశాలో అంతా చేశాం. ఆఖరికి ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. కప్పు అందుకోవడాన్ని నమ్మలేకపోతున్నా. అసలు ఇలాంటి ఓ రోజు వస్తుందని అని ఎప్పుడు అనుకోలేదు. ఆఖరి బంతి వేయగానే భావోద్వేగానికి లోనయ్యాను. ఇదొ గొప్ప అనుభూతి.’ అని కోహ్లీ తెలిపాడు.
గేల్, డివిలియర్స్ కూడా సంబరాలకు అర్హులే..
తనతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కూడా ఈ సంబురాలు చేసుకునేందుకు అర్హులు అని కోహ్లీ చెప్పాడు. వారిద్దరు జట్టు కోసం ఎంతో చేశారన్నాడు.
‘ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా డివిలియర్స్‌కు ఒక్కటే చెప్పాను. ఈ మ్యాచ్ మనకు ప్రత్యేకం కానుందని అన్నాను. అతడితో కలిసి సంబురాలు చేసుకోవాలని అనుకున్నాను. ఆర్‌సీబీ కోసం అతడు ఎంతో చేశాడు. ఆర్‌సీబీ తరుపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు సొంతం చేసుకున్న ఘనత ఇంకా అతడి పేరు మీదే ఉంది. నాలుగేళ్ల కిందట ఆటకు వీడ్కోలు చెప్పినా కూడా అతడి ప్రభావం ఇంకా జట్టుపై ఉంది.’ కోహ్లీ అన్నాడు.
Rohit Sharma : మీరేంట్రా ఇలా ఉన్నారు.. రోహిత్ శర్మను దోచుకున్న ముంబై ప్లేయర్లు..!
ఇక గేల్ కూడా ఎన్నో ఏళ్లు ఆర్‌సీబీ తరుపున ఆడాడు. అందుకే తనతో పాటు వీరిద్దరూ ఈ గెలుపుకు అర్హులని భావిస్తున్నట్లుగా కోహ్లీ చెప్పాడు.
చివరి వరకు బెంగళూరుతోనే..
నిజాయితీగా చెప్పాలంటే తన మనసంతా బెంగళూరుతోనే ఉంటుందని కోహ్లీ అన్నాడు. తాను ఐపీఎల్‌లో చివరి రోజు వరకు ఆర్‌సీబీ తరుపుననే ఆడతానని స్పష్టం చేశాడు. ఇక తానెప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండాలని అనుకోనన్నాడు. 20 ఓవర్ల పాటు మైదానంలో ఉంటూ ప్రభావం చూపించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తనకు మద్దతు ఇచ్చిన సపోర్ట్ స్టాఫ్, మేనేజ్‌మెంట్‌ను ఎప్పటికి మరిచిపోనని చెప్పాడు.