అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో (అంతర్జాతీయ, లీగ్‌లు కలిపి) అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావో రికార్డును బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో బాగంగా ఎంపీ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు.
డ్వేన్ బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లు పడగొడ్డగా.. రషీద్ కేవలం 461 మ్యాచ్‌ల్లోనే 633 వికెట్లు సాధించాడు. ఇందులో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 161 వికెట్లు సాధిచంగా లీగ్ క్రికెట్‌లో 472 వికెట్లు పడగొట్టాడు. లీగ్ క్రికెట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ వంటి జట్ల తరుపున రషీద్ ఆడాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో సునీల్ నరైన్ 536 టీ20ల్లో 574 వికెట్లతో రషీద్‌కు దగ్గరగా ఉన్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
రషీద్ ఖాన్ – 633 వికెట్లు
డ్వేన్ బ్రావో – 631 వికెట్లు
సునీల్ నరైన్ – 574 వికెట్లు
ఇమ్రాన్ తాహిర్ – 531 వికెట్లు
షకీబ్ అల్ హసన్ – 492 వికెట్లు
ఆండ్రీ రసెల్ – 466 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రషీద్ ఖాన్ ఎంపీ కేప్‌టౌన్ కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పార్ల్ రాయల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్-1లో మ్యాచ్‌లో ముంబై 39 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రికెల్టన్ (27 బంతుల్లో 44), వాన్ డెర్ డస్సెన్(32 బంతుల్లో 40), డెవాల్డ్ బ్రెవిస్(30 బంతుల్లో 44 నాటౌట్), డెలానో పోట్‌గీటర్ (17 బంతుల్లో 32 నాటౌట్) రాణించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో పార్ల్ రాయల్స్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. రాయల్స్ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (26 బంతుల్లో 45), దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 31) రాణించినా మిగిలిన వాళ్లు విఫలం కావడంతో రాయల్స్‌కు ఓటమి తప్పలేదు.
కాగా.. రాయల్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాయల్స్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ముంబైతో ఫిబ్రవరి 8న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది.