Rashid Khan world record : అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర (Rashid Khan world record) సృష్టించాడు. సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు టిమ్ సౌథీని వెనక్కి నెట్టాడు.
సౌథీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ 98 మ్యాచ్‌ల్లోనే 165 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో వీరిద్దరి తరువాత ఇష్ సోధి, షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లు ఉన్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 165 వికెట్లు
* టిమ్ సౌథీ (న్యూజిలాండ్) – 164 వికెట్లు
* ఇష్ సోధి (న్యూజిలాండ్) – 150 వికెట్లు
* షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 149 వికెట్లు
* ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్) – 142 వికెట్లు
🚨 HISTORY CREATED BY RASHID. 🚨
– Rashid Khan becomes the leading wicket taker in men’s T20is – 165*. pic.twitter.com/EjkgtS0rQK
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 1, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (40 బంతుల్లో 63 పరుగులు), సెదికుల్లా అటల్ (40 బంతుల్లో 54 పరుగులు) అర్థశతకాలు బాదారు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ రోహిద్ ఖాన్, సగీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లలో ముహమ్మద్ వసీం (37 బంతుల్లో 67 పరుగులు), రాహుల్ చోప్రా (35 బంతుల్లో 52 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. అయినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో యూఏఈకి ఓటమి తప్పలేదు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, షరాఫుద్దీన్ అష్రఫ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఫజల్హాక్ ఫారూఖీ, మహమ్మద్ నబీలు చెరో వికెట్ సాధించారు.