Courtesy BCCI
చిరకాల కోరిక నేరవేర్చుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుదూరంలో ఉంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చరిత్ర సృష్టించనుంది. ఏ జట్టు గెలిచినా కూడా తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోనున్నాయి. కాగా.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకీ పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ఆర్‌సీబీ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడడం పై అనుమానాలు నెలకొన్నాయి. అతడి భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో అతడు తన భార్య పక్కన ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్‌కు ముందు రోజు ఆర్‌సీబీ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో అతడు పాల్గొనలేదు. ఈ క్రమంలో అతడు ఫైనల్‌లో అతడు ఆడతాడా లేదా అన్నదానిపై ఊహాగానాలు చెలరేగాయి.
ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్‌ఫో ప్రకారం.. పంజాబ్‌తో మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు సాల్ట్ చేరుకోలేదని తెలిపింది. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వడంతో.. ఆ సమయంలో ఆమె పక్కన ఉండాలని అతడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్‌సీబీ కోచ్ ఆండీ ప్లవర్, కెప్టెన్ రజత్ పాటిదార్ లు సాల్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారు కీలక మ్యాచ్‌కు ముందు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కోరుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. ప్రాక్టీస్‌కు అతడు ఒక్కడే గైర్హాజరు కాలేదు. మరికొందరు ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ కు రాలేదు. ఈ క్రమంలో సాల్ట్ ఆడతాడా లేదా అన్న దానిపై సందిగ్దత కొనసాగుతోంది. అతడు ఇంటికి వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
RCB : ఆర్‌సీబీకి అన్నీ శుభశకునాలే.. ఈ ఒక్కటి వర్కౌట్ అయితే.. కోహ్లీ చేతిలో కప్పు..
ఆరంభంలోనే ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతూ.. ఆర్‌సీబీకి మంచి ఆరంభాలను అందిస్తున్నాడు ఫిల్ సాల్ట్. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో 175.90 స్ట్రైక్‌రేటుతో 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. ఒకవేళ సాల్ట్ ఫైనల్‌కు దూరం అయితే అది ఆర్‌సీబీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. సాల్ట్ అందుబాటులో లేకపోతే.. విరాట్ కోహ్లీతో పాటు టిమ్ సీఫెర్ట్, మయాంక్ అగర్వాల్‌లలో ఒకరు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.