Roger Binny : బీసీసీఐలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ (Roger Binny) రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికలు జరిగేంత వరకు శుక్లానే బాధ్యతలు చూసుకోనున్నారు.
సౌరవ్ గంగూలీ అనంతరం 2022 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీబాధ్యతలు చేపట్టారు. జూలై 19న ఆయన 70 ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే.. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం 70 ఏళ్లు దాటిన ఏ ఆఫీస్ బేరర్ అయినా ఆ పాత్రలో కొనసాగడానికి అనర్హులు అవుతారు. ఈ క్రమంలోనే బిన్నీ రాజీనామా చేసినట్లుగా దైనిక్ జాగరణ్ పేర్కొంది.
65 ఏళ్ల శుక్లా 2020 నుండి బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌లో జరిగే తదుపరి వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వరకు బోర్డు రోజువారీ వ్యవహారాలను ఆయన నిర్వహించనున్నారు. రాష్ట్ర యూనిట్ల మధ్య ఏకాభిప్రాయం ఆధారంగా AGMలో తదుపరి పూర్తికాల అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోబడుతుందని వర్గాలు సూచిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. బీసీసీఐ యొక్క అపెక్స్ కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది. దీనికి రాజీవ్ శుక్లా అధ్యక్షత వహించారు. ఇన్ని రోజులు భారత జట్టుకు డ్రీమ్ 11 స్పాన్సర్‌గా ఉండగా ఇటీవలే నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో కొత్త స్పాన్సర్ ఎంపికనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది.
Ravichandran Ashwin : ఐపీఎల్ రిటైర్మెంట్ పై అశ్విన్ కామెంట్స్.. ధోని లాంటి వ్యక్తి..
సెప్టెంబర్ 9 నుంచే ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీకి రెండు వారాల సమయం కూడా లేదు. ఇంత తక్కువ సమయంలో కొత్త స్పాన్సర్‌ను కనుగొడం అంత సులభం కాదని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. టెండర్లను ప్రకటించడం, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయడం, సాంకేతిక అంశాలను నిర్వహించడానికి సమయం కావాల్సిఉందని చెప్పింది.
తాము ఆసియా కప్ కోసం స్వల్పకాలిక స్పాన్సర్ కోసం చూడడం లేదంది. 2027లో అక్టోబర్-నవంబర్ నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు అంటే రెండున్నర ఏళ్ల పాటు భారత జట్టుకు ఉపయోగ పడే స్పాన్సర్ కోసం చూస్తున్నట్లు తెలిపింది.