Rohit Sharma
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ హైబ్రిడ్ మోడ్‌లో జరగనుంది. టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని టీమ్ఇండియా ఆరాటపడుతోంది. ఇదిలాఉంటే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను ఓ మైలురాయి ఊరిస్తోంది.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శతకంతో రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. మూడో వన్డేలో ఒక్క పరుగుకే ఔటైనా కూడా ఛాంపియన్స్ ట్రోఫి ముందు హిట్‌మ్యాన్ ఫామ్ అందుకోవడంతో టీమ్ఇండియాకు లాభించే అవకాశం. కాగా.. ఈ టోర్నీలో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ గనుక 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 268 వన్డేలు ఆడాడు. 260 ఇన్నింగ్స్‌ల్లో 49 సగటుతో 10,988 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 57 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 264. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ 11వేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అదే గనుక జరిగితే.. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న రెండో ప్లేయర్‌గా రికార్డుకు ఎక్కుతాడు. ఈ క్రమంలో సచిన్, గంగూలీ, పాంటింగ్ ల రికార్డు బ్రేక్ చేయనున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన జాబితాలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 11వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ (భారత్) – 222 ఇన్నింగ్స్‌ల్లో
సచిన్ టెండూల్కర్ (భారత్) – 276 ఇన్నింగ్స్‌ల్లో
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 286 ఇన్నింగ్స్‌ల్లో
సౌరవ్ గంగూలీ (భారత్) – 288 ఇన్నింగ్స్‌ల్లో
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 293 ఇన్నింగ్స్‌ల్లో
IND vs ENG : వన్డే సిరీస్ ట్రోఫీని మరిచిపోయిన కోహ్లీ, రోహిత్, రాహుల్.. వీడియో వైరల్
వన్డేల్లో 11వేల క్లబ్‌లో అడుగుపెట్టిన పదో ఆటగాడిగా..
ఇక వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది ఆటగాళ్లు మాత్రమే 11వేల కంటే ఎక్కువ పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ 12 పరుగులు చేస్తే వన్డేల్లో పదకొండు వేల పరుగులు సాధించిన పదో ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 18,426 రన్స్‌తో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సంగక్కర, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్‌లు ఆ తరువాత వరుసగా ఉన్నారు.
వన్డేల్లో 11000ఫ్లస్ రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 18,426 పరుగులు
* కుమార సంగక్కర (శ్రీలంక) – 14, 234 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – 13,963 పరుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13,704 పరుగులు
* సనత్ జయసూర్య (శ్రీలంక) – 13,430 పరుగులు
* జయవర్థనే (శ్రీలంక) – 12,650 పరుగులు
* ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) – 11,739 పరుగులు
* జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 11579 పరుగులు
* సౌరవ్ గంగూలీ (భారత్) – 11363 పరుగులు.