×
Ad

Vijay Hazare Trophy : తగ్గేదేలే!.. సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. బౌండరీల వర్షం

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున బరిలోకిదిగగా.. రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున బరిలోకిదిగి శతకాలతో అదరగొట్టారు.

Vijay Hazare Trophy

Vijay Hazare Trophy : భారత దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత మోగింది. యువ ప్లేయర్లతోపాటు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సెంచరీలతో సత్తాచాటారు. దీంతో ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లలో సెంచరీల మోత మోగింది. ఏకంగా ఒకే రోజు 22సెంచరీలు నమోదయ్యాయి.

Also Read : vijay hazare trophy : సూర్యవంశీ కంటే డేంజర్‌గా ఉన్నాడే.. బాబోయ్.. 32బంతుల్లో సెంచరీ.. 574 పరుగులు.. ఇది టెస్టు స్కోర్ కాదు గురూ..

ముఖ్యంగా ఈ టోర్నీలో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున బరిలోకి దిగగా.. రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున బరిలోకిదిగి శతకాలతో అదరగొట్టారు.


ఎలైట్ గ్రూప్ -డిలో భాగంగా జరిగిన పోరులో కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టుపై విజయం సాధించింది. తొలుత ఆంధ్ర జట్టు బ్యాటింగ్ చేయగా.. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు 37.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే, ఈ జట్టులో రికీ భుయ్ (122) సెంచరీతో అదరగొట్టగా.. విరాట్ కోహ్లీ సైతం 14 ఫోర్లు మూడు సిక్సుల సహాయంతో 101 పరుగులతో సెంచరీ చేశాడు.


సచిన్ రికార్డును బ్రేక్ ..
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో కోహ్లికిది 58వ శతకం. ఈ క్రమంలో విరాట్‌ లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ 391 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ అందుకోగా… విరాట్ కోహ్లి 330 ఇన్నింగ్స్‌లో 16 వేల పరుగుల మైలురాయి దాటాడు.

రోహిత్ శర్మ సిక్సర్ల మోత..
టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మసైతం విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టాడు. మైదానం నలువైపుల బౌండరీలు కొడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఎలైన్ గ్రూప్ -సీలో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై, సిక్కిం జట్లు తలపడ్డాయి. తొలుత సిక్కిం బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 30.3 ఓవర్లలో 237 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై తరపున బరిలోకిదిగిన రోహిత్ శర్మ 94 బంతుల్లోనే 155 పరుగులతో చెలరేగిపోయాడు. ఇందులో 18 పోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. విజయ్ హజారే ట్రోఫీలో తొలి రోజు బుధవారం రికార్డు స్థాయిలో 22 సెంచరీలు నమోదయ్యాయి. రోహిత్, విరాట్ కోహ్లీతోపాటు యువ ప్లేయర్లు వైభవ్ సూర్య వంశీ, సుకీబుల్ గనీ, ఆయుశ్ లొహారుక, ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్ తోపాటు పలువురు ప్లేయర్లు సెంచరీలతో అదరగొట్టారు.