Rohit Sharma
Rohit Sharma: భారత జట్టును ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలిపించిన రోహిత్ శర్మకు వన్డేల్లో కెప్టెన్‌గా మరింత కాలం అవకాశం ఇస్తారని చాలా మంది భావించారు. కానీ.. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కి శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ అప్పగించారు.
రోహిత్ శర్మ జట్టులో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్, కోహ్లీ తొలిసారి మళ్లీ సిరీస్‌లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ నవీ ముంబైలో కఠిన శిక్షణలో నిమగ్నమయ్యాడు. (Rohit Sharma)
రెవ్‌స్పోర్ట్జ్ తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్ శర్మ మంగళవారం 3 గంటలపాటు శిక్షణలో పాల్గొన్నాడు. “ఎనిమిది నుండి పది మంది బౌలర్లు నెట్స్‌లో బౌలింగ్ చేశారు. రోహిత్ వారిని ముంబై మైదానాల్లోని వేర్వేరు క్లబ్‌ల కోచ్‌ల సాయంతో తానే ఏర్పాటు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఫిజియో అమిత్ దుబే కూడా అక్కడ ఉండి మొత్తం శిక్షణను పర్యవేక్షించాడు” అని రెవ్‌స్పోర్ట్జ్ తెలిపింది.
రోహిత్ ప్రాక్టీస్‌లో ప్రధానంగా షార్ట్ డెలివరీలను ఎదుర్కోవడం, హారిజాంటల్ బ్యాట్ షాట్స్ ఆడడంపైనే దృష్టిపెట్టినట్లు సమాచారం. హారిజాంటల్ బ్యాట్ షాట్స్ అంటే బ్యాట్‌ను నేలకు సమాంతరంగా ఉంచి ఆడే షాట్లు. రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడని, మళ్లీ మైదానంలో హిట్ మ్యాన్ మెరుపులు చూస్తామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, చాలా కాలం తర్వాత రోహిత్ మైదానంలో కనపడనున్నాడు. అయితే, ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.