అవమానం.. అందుకే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేలకు సైతం రిటైర్‌మెంట్ ప్రకటిస్తారు: మనోజ్ తివారీ
"గౌరవంలేని చోట ఎవరూ ఉండరని నేను నమ్ముతున్నాను” అని తివారీ అన్నారు.

Kohli and Rohit
Manoj Tiwary: టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌లో చివరి దశలో ఉన్నారా? ప్రస్తుతం కనపడుతున్న సంకేతాలు అలానే ఉన్నాయి. వీరిద్దరు ఇప్పటికే టెస్ట్‌లు, టీ20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో వారిద్దరు భారత జట్టులో ఉన్నప్పటికీ, ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ కాదు.
టెస్ట్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌కు వన్డే జట్టు బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో, భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తాజాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ గురించి స్పందిస్తూ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు “అవమానకరమైనవి”గా ఉన్నాయని అన్నారు. కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డేల్లోనూ రిటైర్ అయ్యే అవకాశముందని అన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తదితరులపై పరోక్షంగా తివారీ విమర్శలు చేశారు.
“రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత అతడు ఇక రిటైర్ కావాలని మీరు చెప్పారు. ఇది విరాట్ కోహ్లీపై కూడా ప్రభావం చూపుతుందా?” అని తాజాగా క్రిక్ట్రాకర్ ఇంటర్వ్యూలో మనోజ్ తివారీని అడిగారు. (Manoj Tiwary)
దీనికి తివారీ స్పందిస్తూ.. “ఇప్పటికే చూపింది. లేదంటే విరాట్ టెస్ట్ క్రికెట్ నుంచి ఎందుకు బయటకు వచ్చేవాడు? అప్పుడు అతడు ఇంగ్లాండ్ సిరీస్ కోసం మానసికంగా సిద్ధమవుతున్నాడు. కానీ.. భారత క్రికెట్‌లోని వాతావరణం, పరిస్థితుల ప్రభావంతో కోహ్లీకి ఇక తాను జట్టుకు అవసరంలేని వాడిగా అనిపించాయి. ఆటగాడు ఎంత గొప్పవాడైనా సరే.. అవసరం లేనివాడిగా, గౌరవంలేని వాడిగా అతడికి అనిపించినప్పుడు, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి ఎవరూ ఆటలో కొనసాగడు” అని చెప్పారు.
“అందుకే విరాట్ టెస్ట్ క్రికెట్ నుంచి మౌనంగా తప్పుకున్నాడు. నిరాశతో కాదు.. ఆత్మగౌరవంతో. ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే, రోహిత్ కూడా భవిష్యత్తులో అదే దశకు చేరుకోవచ్చు. గౌరవంలేని చోట ఎవరూ ఉండరని నేను నమ్ముతున్నాను” అని తివారీ అన్నారు.
ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా గిల్!
శుభ్‌మన్ గిల్ భవిష్యత్‌లో ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా ఉంటారని తివారీ అన్నారు. “ఇందులో పెద్ద మర్మం లేదు. క్రికెట్ పెద్దల ప్రకటనల ద్వారా ఇది స్పష్టమవుతోంది. వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కెప్టెన్లు వద్దని వారు అనుకుంటున్నారు. అంటే శుభ్‌మన్ గిల్‌ను అన్ని ఫార్మాట్‌ల కెప్టెన్‌గా చేస్తారన్న సంకేతాలు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ మార్పు ఎందుకు? కెప్టెన్‌ను నియమించడంలో ఉద్దేశం మ్యాచ్‌లు గెలవడం. రోహిత్ శర్మ ఇప్పటికే అది సాధిస్తున్నాడు” అని అతడు అన్నారు.
“జట్టు ప్రదర్శన బాగుంది, ఫలితాలు వస్తున్నాయి. మరి ఈ మార్పు అవసరం ఏమిటి? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత క్రికెట్ కోసం చేసిన కృషి దృష్ట్యా చూసుకుంటే వారి పట్ల ఇలా ప్రవర్తించడం వారికి అవమానమే. త్వరలోనే ఇద్దరూ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. బహుశా ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఈ ప్రకటనలు రావచ్చు” అని మనోజ్ తివారీ చెప్పారు.