Rohit Sharma End To Retirement Speculations With Social Media Post
Rohit Sharma : టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. గత కొన్నాళ్లుగా వన్డేల నుంచి కూడా హిట్‌మ్యాన్ తప్పుకుంటాడు అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు రోహిత్ శర్మ (Rohit Sharma) నేరుగా స్పందించలేదు. అయితే.. సోషల్ మీడియాలో రెండు ఫోటోలతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాను ఇప్పట్లో రిటైర్ అయ్యే అవకాశం లేదని చెప్పకనే చెప్పేశాడు.
అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం రోహిత్ శర్మ తన ప్రాక్టీస్ ను ప్రారంభించాడు. బుధవారం తన శిక్షణా సెషన్‌కు సంబంధించిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి వాకింగ్ చేస్తున్నది కాగా ప్యాడ్లను కట్టుకుంటున్నది రెండోది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకేముంది ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మిమ్మల్ని మైదానంలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఒక అభిమాని కామెంట్ చేయగా.. 2027 వన్డే ప్రపంచకప్ కోసం రోహిత్ సిద్ధం అవుతున్నాడు అని మరో అభిమాని అన్నాడు.
మిగిలిన ఫార్మాట్లలో రోహిత్ రికార్డులు ఎలా ఉన్నా సరే.. వన్డేల్లో మాత్రం ఆల్ టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా ఉంటాడు. 273 మ్యాచ్‌లు ఆడాడు. 265 ఇన్నింగ్స్‌ల్లో 48.8 సగటుతో 11,168 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 264. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
వన్డే ప్రపంచకప్ సాధించడమే తన జీవిత ఆశయం అని ఇప్పటికే పలు సందర్భాల్లో రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ క్రమంలోనే రోహిత్ మదిలో వన్డే ప్రపంచకప్ 2027లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.