Rohit Sharma Jokingly Scolds A Man Reason Is Dent In His Car
ముంబై వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్‌కు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టారు. శుక్రవారం ఆ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మతో పాటు అతడి తల్లిదండ్రులు, భార్య రితిక, సోదరుడు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యాక వాంఖడే స్టేడియం నుంచి వారు బయటికి వెలుతుండగా ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై రోహిత్ శర్మ మండిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఆటతో పాటు కార్లు అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. వాటిని కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు. అతడి కార్ల గ్యారేజీలో కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. కాగా.. వాంఖడే స్టేడియం నుంచి బయటకు వస్తుండగా కారు వెనుకభాగంలో కొంచెం డ్యామేజీ ఉండడాన్ని రోహిత్ శర్మ గమనించాడు.
Proper car lover. Dents are not allowed.😭🔥 pic.twitter.com/Dos7jPwVUj
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@ImHydro45) May 16, 2025
వెంటనే ‘ఇది ఏమిటి?” అని పక్కనే ఉన్న వ్యక్తిని అడిగాడు. అతడు ‘రివర్స్’ అని సమాధానం ఇచ్చాడు. ‘ఎవరిది? నీదా?’ అని రోహిత్ శర్మ అన్నాడు. ఆ తరువాత తన తల్లిదండ్రులు కారు ఎక్కేందుకు రోహిత్ సాయం చేశాడు.
ఇదిలా ఉంటే.. స్టాండ్ ఆవిష్కరణ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చిన వారు అందరికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఓ స్టాండ్‌కు తన పేరు పెడతారని తాను ఊహించలేదన్నాడు. చిన్నప్పుడు ముంబై తరుపు, టీమ్ఇండియా తరుపున ఆడాలని కలలు కనేవాడినని, ఆ సమయంలో వీటి గురించి తాను ఎప్పుడు ఆలోచించలేదన్నారు.
‘ఏ ఆటగాడికైనా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఉంటుంది. దేశాన్ని గెలిపించాలని ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు సాధిస్తారు. అయితే.. వాటి అన్నింటి కంటే ఇది ఎంతో ప్రత్యేకం.’ అని రోహిత్ చెప్పాడు. ఇక వాంఖడే స్టేడియం ఎంతో గొప్ప స్టేడియం అని, ఇక్కడ తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు. ఇక్కడ ఏ జట్టుతోనైనా టీమ్ఇండియా తరుపున ఆడటం తనకు ఎంతో ప్రత్యేకం అని తెలిపాడు.
తన కుటుంబ సభ్యుల ముందు ఈ గౌరవాన్ని అందుకోవడం ఎంతో గొప్పగా ఉంది అని రోహిత్ శర్మ అన్నాడు.