RR vs GT: ఆర్ఆర్ బ్యాటర్‌ వైభవ్ సూర్యవంశీ షాట్లు బాదిన తీరుపై జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే?

ఈ మ్యాచులో అతడికి బాగా కలిసి వచ్చిందని, దీన్ని బాగా వాడుకున్నాడని చెప్పాడు.

Pic: @BCCI

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్‌ వైభవ్ సూర్యవంశీ(14)పై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆట మొత్తం వైభవ్‌దేనని అన్నాడు. ఐపీఎల్ 2025లో నిన్న జరిగిన మ్యాచులో గుజరాత్‌ను రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 101 పరుగులు చేసి రాజస్థాన్‌ రాయల్స్‌ను గెలిపించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీదేనని, అతడు షాట్లు ఆడిన తీరు అద్భుతంగా ఉందని తెలిపాడు. ఈ మ్యాచులో అతడికి బాగా కలిసి వచ్చిందని, దీన్ని బాగా వాడుకున్నాడని చెప్పాడు.

ఈ మ్యాచులో పవర్ ప్లేలోనే గుజరాత్‌ ఓటమి ఖాయమైందన్నాడు. రాజస్థాన్‌ గెలిచిన ఘనత అంతా ఆ జట్టు బ్యాటర్లదేనని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. గుజరాత్ మరింత బాగా ఆడితే బాగుండేదని అన్నాడు.

Also Read: తన మొట్టమొదటి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ కామెంట్స్‌.. ఈ చిన్నోడు ఏమన్నాడంటే?

మ్యాచు ప్రారంభంలో తమకు కొన్ని ఛాన్స్‌లు వచ్చినప్పటికీ తాము వాటిని సరిగ్గా వినియోగించుకోలేదని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. టీమ్‌ పరంగా కొన్ని అంశాల్లో తాము ఇంకా మెరుగవ్వాలని అన్నాడు.

తాము ఇక వరుసగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, వెన్ను నొప్పి కారణంగా తాను ఫీల్డింగ్ చేయలేదని, విశ్రాంతి తీసుకోవడం మంచిదని భావించానని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. విజయం సాధించినా, ఓటమి ఎదురైనా తాము అంతగా పట్టించుకోబోమని, ఓ మ్యాచ్ అయిపోయిందనే భావిస్తామని చెప్పాడు.

తమకు నెక్ట్స్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో ఉందని, ఆ గ్రౌండ్‌లో తమకు మంచి రికార్డ్ ఉందని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కాగా, వైభవ్ సూర్యవంశీపై క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌ జట్టులో కీలకంగా మారతాడని అంటున్నారు.