Salman Ali Agha Strange T20 World Cup Announcement Amid Suspense Over Participation
T20 World Cup 2026 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహోర్ వేదికగా గురువారం ఆసీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాక్ జట్టు 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ (40; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (39; 27 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. బాబర్ ఆజామ్ (20 బంతుల్లో 24 పరుగులు) పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీశాడు. మహ్లీ బార్డ్‌మాన్, జేవియర్ బార్ట్‌లెట్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
Shikhar Dhawan : బీచ్‌లో కాబోయే భార్యతో చిల్ అవుతున్న శిఖర్ ధావన్.. ఫోటోలు.
అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (36; 31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), తాత్కాలిక సారథి ట్రావిస్ హెడ్ (23; 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేవియర్ బార్ట్‌లెట్ (34 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా మిగిలిన వారు ఘోరంగా విఫలం అయ్యారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. షాదాబ్ ఖాన్, నవాజ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కువగా ఐదు లేదా ఆరో స్థానంలో ఆడే పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో వన్‌డన్‌లో ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగి 27 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులు సాధించాడు. దీనిపై మ్యాచ్ అనంతరం సల్మాన్ మాట్లాడుతూ.. ఇకపై తాను టీ20ల్లో మూడో స్థానంలోనే బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు.
ఆసీస్‌తో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లతో పాటు టీ20 ప్రపంచకప్ వరకు తాను మూడో స్థానంలోనే ఆడతానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఆడే మ్యాచ్‌లు అన్ని శ్రీలంక వేదికగానే జరగనున్నాయి. లంక పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే సల్మాన్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకున్నట్లుగా అర్థమవుతోంది.
బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలుగుతామని పాక్ క్రికెట్ బోర్డు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న వేళ.. కెప్టెన్ సల్మాన్ మాత్రం తాను టీ20 ప్రపంచకప్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగుతానని చెప్పడం గమనార్హం.