NoBall: పాపం సందీప్ శర్మ.. నోబాల్ ఎంతపని చేసింది.. ఏంటి అది నోబాల్ కాదా!

సందీప్ శర్మ వేసిన బంతిని నోబాల్ గా ప్రకటించడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. అలాగే సమద్ క్యాచ్ ఇచ్చినప్పుడు బ్యాటర్లు ఇద్దరూ రన్ తీశారని.. అలాటంప్పుడు చివరి బంతి స్ట్రైకింగ్ సమద్ కు ఎలా ఇస్తారని కూడా..

Sandeep Sharma NoBall: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో అనూహ్య ఫలితం వచ్చింది. మొదట రాజస్థాన్ గెలిచిందని సంబరాలు చేసుకున్నారు. చివరికి చూస్తే హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఒక్క నోబాల్ ఫలితాన్ని మార్చేసింది. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ వేసిన చివరి బంతికి స‌మ‌ద్ ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ గెలిచిందని అంతా అనుకున్నారు. అయితే తర్వాత అది నోబాల్ గా తేలడంతో మ్యాచ్ ఫలితం తారుమారయింది. చివరి బంతికి సమద్ సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ విజయం సాధించింది.

మ్యాచ్ ఫలితంతో పాటు సందీప్, సమద్ పాత్రలు కూడా మారిపోయాయి. సమద్ ఔట్ చేసి రాజస్థాన్ ను గెలిపించానుకున్న సందీప్ ముందుగా హీరోగా నిలిచి తర్వాత విలన్ అయ్యాడు. చివరి బంతికి ఔటయినప్పు సమద్ ను తిట్టుకున్నారు అభిమానులు. మళ్లీ అదే బంతికి సిక్స్ కొట్టి సమద్ హీరోగా నిలవడంతో అతడిపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి ఒక్క నోబాల్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.

Also Read: రాజ‌స్థాన్ కొంప‌ముంచిన నోబాల్‌.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజ‌యం

నోబాల్ ఎలా ఇస్తారు?
సందీప్ శర్మ వేసిన బంతిని నోబాల్ గా ప్రకటించడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. సందీప్ బంతిని వేయకముందే బ్యాటర్ మార్కో జాన్సెన్ క్రీజ్ దాటాడని, దీన్ని ఎలా నోబాల్ గా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు. అలాగే సమద్ క్యాచ్ ఇచ్చినప్పుడు బ్యాటర్లు ఇద్దరూ రన్ తీశారని.. అలాటంప్పుడు చివరి బంతి స్ట్రైకింగ్ సమద్ కు ఎలా ఇస్తారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ లో నోబాల్
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ్యాచ్ ఫలితానికి తారుమారు కావడానికి కారణమైన నోబాల్ సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచింది. #NoBall హ్యాష్ ట్యాగ్ తో ట్విటర్ లో ఫొటోలు, వీడియోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. సందీప్ శర్మపై నెటిజన్లు జోకులు, సెటైర్లు వేస్తున్నారు. కొంతమంది అయితే అతడిని విమర్శిస్తున్నారు. స‌న్‌రైజ‌ర్స్ సరైన సమయంలో పుంజుకుని విజయం సాధిచడాన్ని ప్రశంసిస్తున్నారు.

శభాష్ శాంసన్
మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ హుందాగా వ్యవహరించిన తీరు క్రికెట్ అభిమానులకు ఆకట్టుకుంది. విజయం దక్కినట్టే దక్కి చేజారడంతో రాజస్థాన్ టీమ్ సభ్యులు నిరాశలో మునిగిపోయారు. అయితే సంజూ మాత్రం ఓటమిని కూడా హుందా స్వీకరించాడు. ఎక్కడా అసహనం వ్యక్తం చేయలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. ట్వి20 మ్యాచ్ ల్లో ఫలితం ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేమని.. పొట్టి ఫార్మాట్ ప్రత్యేకత ఇదేనంటూ చెప్పుకొచ్చాడు.