Sanju Samson
Sanju Samson reaction : అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో వన్డే ప్రపంచప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ జట్టులో యువ ఆటగాడు సంజు శాంసన్ (Sanju Samson) కు చోటు దక్కలేదు. ఈ క్రమంలో సంజు శాంసన్‌కు అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు మెగా టోర్నీకి ఎంపిక చేయకపోగా, ఇటు ఆసియా క్రీడల్లో సైతం శాంసన్‌కు చోటు ఇవ్వకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. పాపం సంజు అంటూ కామెంట్లు పెడుతన్నారు.
వాస్తవానికి వన్డే ప్రపంచకప్ ఆడాలని సంజు శాంసన్ భావించాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. అయితే.. గాయపడిన కేఎల్ రాహుల్ (KL Rahul) కోలుకుని రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజుకు ఛాన్స్ లేకుండా పోయింది. అదే సమయంలో ఇంగ్లాండ్ కౌంట్లీలో ఆడే ఛాన్స్ వచ్చింది. అయితే.. ఆసియాకప్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక కావడంతో కౌంటీల్లో ఆడే అవకాశాన్ని అతడు కోల్పోయాడు. ఇటు ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులోనూ చోటు దక్కలేదు. కనీసం ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అయినా ఎంపిక చేస్తారని బావించినప్పటికీ నిరాశ తప్పలేదు.
ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన కాసేపటికి సంజు శాంసన్ తన ఫేస్ బుక్ అకౌంట్‌లో నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన అభిమానులతో పాటు టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు సైతం సంజుపై సానుభూతి చూపిస్తున్నారు. ఒక వేళ సంజు శాంసన్ స్థానంలో తాను గనుక ఉండి ఉంటే చాలా నిరాశకు గురి అయ్యే వాడినంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేయగా, ప్రస్తుతం సంజు ఉన్న స్థానంలో ఎవరూ ఉండాలని కోరుకోరు అంటూ ఉతప్ప అన్నాడు.
Asian Games 2023 : మొదటి మ్యాచ్‌లోనే చెత్త రికార్డు.. 15 పరుగులకే మంగోలియా ఆలౌట్
అందరూ తనపై చూపిస్తున్న సానుభూతి పట్ల సంజు స్పందించాడు. జరిగేది ఏదో జరుగుతుంది. అయినప్పటికీ తాను ముందుకు సాగుతాను అని అర్థం వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో సంజు పోస్ట్ చేశాడు.