Saurabh Netravalkar : సౌరభ్ నేత్రావల్కర్ పై ఒరాకిల్ స్పెషల్ పోస్ట్..

Saurabh Netravalkar
Saurabh Netravalkar : పొట్టి ప్రపంచకప్‌లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు సౌరభ్ నేత్రావల్కర్. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పై అమెరికా అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో సౌరభ్ ఒకరు. వృతి రీత్యా ఇంజినీర్ అయిన అతడు క్రికెట్ పై మమకారంతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం అతడి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈ క్రమంలో అమెరికాలో అతడు పని చేస్తున్న ఒరాకిల్ సంస్థ సైతం అతడి ప్రదర్శన పై స్పందించింది.
భారత్‌కు చెందిన సౌరభ్ నేత్రావల్కర్ 1991 అక్టోబర్ 16 న ముంబైలో జన్మించారు. చిన్నప్పటి నుంచే అతడికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. భారత అండర్-19 జట్టు తరుపున ఆడాడు. 2010లో జరిగిన అండర్-19 టోర్నీలో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ముంబై తరుపున రంజీల్లో ప్రాతినిధ్యం వహించినా తీవ్రమైన పోటీ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
IND vs PAK : పాక్‌తో మ్యాచ్.. టీమ్ఇండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్‌కు గాయం..!
ప్రొఫెషనల్ క్రికెట్‌లో అవకాశాలు రాకపోవడంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. ఉన్నత విద్య కోసం 23 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. ఆటపై ఇష్టాన్ని చంపుకోలేక స్థానికంగా ఆడాడు. చివరకు అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. కొంతకాలం అమెరికా జట్టుకు నాయకత్వం వహించాడు. ఇప్పటి వరకు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచులు ఆడాడు.
ప్రస్తుతం ఒరాకిల్ సంస్థలో పని చేస్తున్న అతడు పాకిస్తాన్ పై విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో సోషల్ మీడియాలో అతడి పేరు వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఒరాకిల్ కూడా స్పెషల్ పోస్ట్ చేసింది. ‘అమెరికా క్రికెట్ టీమ్‌కు శుభాకాంక్షలు. జట్టు ప్రదర్శన పై గర్వంగా ఉంది. మా ఇంజినీర్, క్రికెట్ స్టార్ సౌరభ్ అద్భుతంగా ఆడాడు.’ అని రాసుకొచ్చింది.
SL vs BAN : సంచలనాలకు అడ్డాగా పొట్టి ప్రపంచకప్.. శ్రీలంక పై బంగ్లాదేశ్ గెలుపు..
Congrats @USACricket on a historic result! Proud of the team and our very own engineering and cricket star @Saurabh_Netra #T20WorldCup https://t.co/adk6OZLide
— Oracle (@Oracle) June 7, 2024