Shafali Verma comments After Womens World Cup 2025 Final Heroics
Shafali Verma : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత విజయంలో యువ ఓపెనర్ షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 78 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసింది. ఆపై బౌలింగ్‌లో కీలక ప్లేయర్లు సునే లూస్, మారిజాన్ కాప్ ఔట్ చేసింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
వాస్తవానికి మహిళల వన్డే ప్రపంచకప్ 2025కి బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టులో షెషాలీ వర్మ(Shafali Verma) కు చోటు దక్కలేదు. అయితే.. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీకా రావల్ గాయపడింది. దీంతో షెఫాలీని ఎంపిక చేశారు. సెమీఫైనల్ ఆడిన షెఫాలీ కేవలం 10 పరుగులు మాత్రమే చేశారు. అయితే.. ఫైనల్‌లో మాత్రం తనదైన శైలిలో దుమ్ములేపి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది.
BCCI : వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తరువాత షెఫాలీ వర్మ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ విజయంలో భాగం కావాలని, జట్టుకు ఏదైనా మంచి చేయాలనే ఆ దేవుడు తనను ఈ మ్యాచ్ ఆడించాడని చెప్పింది. తాను జట్టులోకి వచ్చిన రోజే ఈ మాట అన్నానని, ఈ రోజు అది జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక ప్రపంచకప్ గెలవడంతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక తన ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నట్లుగా వెల్లడించింది.
తనకు అండగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలియజేసింది. ఇక ఈ మ్యాచ్ గెలవడం తనకు, తన జట్టుకు ఎంతో ముఖ్యం అని చెప్పింది. తాను ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలనని అంది. తల్లి దండ్రులు, స్నేహితులు, సోదరులు తనకు ఎంతో అండగా ఉన్నారని, ఎలా ఆడాలి అనే దానిపై తనకు అవగాహన కలిగించారని చెప్పుకొచ్చింది.
మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ మైదానంలో తన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసినట్లుగా వెల్లడించింది. ఇక సీనియర్ ప్లేయర్లు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ లు తనకు ఎంతో అండగా నిలిచారంది. సహజ శైలిలో ఆడాలని చెప్పినటక్లు తెలిపింది. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను చూస్తే తనకు ఎంతో స్ఫూర్తి కలుగుతుందని చెప్పింది. ఆయనతో తాను తరుచుగా మాట్లాడుతుంటానని, తనకు ఎంతో ధైర్యం చెబుతుంటారని షెఫాలీ అంది.