BCCI : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం.. భార‌త మ‌హిళ‌ల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వ‌ర్షం..

తొలిసారి మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టుకి బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది.

BCCI : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం.. భార‌త మ‌హిళ‌ల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వ‌ర్షం..

BCCI Announces Whopping Cash Prize For India Women's

Updated On : November 3, 2025 / 9:35 AM IST

BCCI : దశాబ్దాల నిరీక్షణకు తెర‌ప‌డింది. భారత మహిళల స్వప్నం సాకారమైంది. ఫైన‌ల్‌లో చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌ద‌ర్శ‌న చేసిన వేళ.. క‌ల‌ల క‌ప్పు సొంత‌మైంది. సొంతగడ్డపై వేలాది ప్రేక్షకుల మధ్య హర్మన్‌ప్రీత్‌ బృందం ప్రపంచకప్పును ముద్దాడింది.

ఆదివారం న‌వీ ముంబై వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025 ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేసింది. షెఫాలి వర్మ (87; 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), దీప్తి శర్మ (58; 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు చేయ‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. స్మృతి మంధాన (45; 58 బంతుల్లో 8 ఫోర్లు), రిచా ఘోష్‌ (34; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించారు.

అనంత‌రం కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ (101; 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంట‌రి పోరాటం చేసిన మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 299 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్ష‌ణాఫ్రికా 45.3 ఓవ‌ర్ల‌లో 246 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. భారత బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ ఐదు వికెట్ల‌తో స‌ఫారీల ప‌త‌నాన్ని శాసించింది. షెఫాలీ వ‌ర్మ రెండు వికెట్లు తీసింది. శ్రీ చ‌ర‌ణి ఓ వికెట్ సాధించింది.

బీసీసీ భారీ న‌జ‌రానా…

మ‌హిళల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలిసారి విశ్వ‌విజేత‌గా నిలిచిన భార‌త్ పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌రోవైపు బీసీసీఐ (BCCI) కూడా జ‌ట్టుకు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. రూ.51 కోట్ల‌ను బ‌హుమ‌తిగా ప్ర‌క‌టించింది.

Harmanpreet Kaur : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం పై హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ కామెంట్స్‌.. నేను షెఫాలీ వైపు చూశాను.. కానీ ఆమె మాత్రం..

‘జైషా బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి భార‌త మ‌హిళ‌ల క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఇక ఆయ‌న ఐసీసీ ఛైర్మ‌న్‌గా కూడా త‌న ప్ర‌త్యేక‌ను చాటుకున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ప్రైజ్‌మ‌నీ విష‌యంలో కూడా పురుషుల జట్టు కంటే ఎక్కువ ప్రైజ్‌మ‌నీ అందించారు. ఇక ఇప్పుడు విశ్వ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టు బీసీసీఐ నుంచి రూ.51 కోట్లు అందిస్తున్నాం. ఈ మొత్తాన్ని ప్లేయ‌ర్లు, కోచ్‌లు, స‌హాయ‌క సిబ్బందికి అంద‌జేస్తాం.’ అని బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్ సైకియా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఐపిఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ జట్టు యొక్క చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించారు. ‘భారత మహిళా క్రికెట్ కు ఇది ఒక చిరస్మరణీయమైన రోజు. 1983లో పురుషుల జట్టు సాధించిన విజయాన్ని నేడు ముంబైలో భారత మహిళలు పునఃసృష్టించారు. ఈ చారిత్రాత్మక విజయం దేశంలో మహిళా క్రికెట్ కు అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన ఆట ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను.’ అని ధుమల్ తెలిపారు.