Harmanpreet Kaur : వన్డే ప్రపంచకప్ విజయం పై హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్.. నేను షెఫాలీ వైపు చూశాను.. కానీ ఆమె మాత్రం..
వన్డే ప్రపంచకప్ విజయంపై టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది.
Harmanpreet Kaur comments after India win Womens ODI World Cup
Harmanpreet Kaur : ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ను ఎట్టకేలకు భారత మహిళల జట్టు అందుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమ్ఇండియా. దీంతో సంబరాలు అంబరాన్ని అంటాయి.
కాగా.. ఈటోర్నీలో సెమీస్ చేరుకోవడమే కష్టమన్న దశ నుంచి గొప్పగా పుంజుకుని భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. దీని వెనుక ప్రతి ప్లేయర్ కష్టం ఉందని, జట్టు ఇచ్చిన మద్దతుతోనే ఇది సాధ్యమైందని టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో దీప్తిశర్మ, షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శననతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని చెప్పింది.
మ్యాచ్ అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తమకు అండగా నిలిచిన జట్టు మేనేజ్‌మెంట్, బీసీసీఐలతో పాటు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది. ఇది ఆరంభమేనని, భవిష్యత్తులో మరిన్ని ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేసింది.
షెఫాలీ వైపు చూశాను..
ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికి కూడా జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదంది. జట్టులోని ప్రతి ఒక్కరు ఎంతో పాజిటివ్‌గా ఉన్నారు. కప్పును ముద్దాడాలంటే ఏం చేయాలనే దానిపై ప్రతి ప్లేయర్‌కు ఓ స్పష్టత ఉంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఓడిపోవడం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. గెలుపుకు చేరువగా వచ్చి మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. గతంలో ఇలాంటివి చవి చూసినప్పటికి కూడా ఈ సారి ఆ బాధను తట్టుకోలేకపోయాము. ఓటమికి డీలా పడకుండా మున్ముందు ఏం చేయాలని అనే దానిపై దృష్టిపెట్టాలని, చేసిన పొరపాట్లను మళ్లీ చేయొద్దు అని, గెలుపు లైన్‌ను క్రాస్ చేయాలని కోచ్ చెప్పారు. తరువాత నుంచి చాలా మారిపోయింది. ఆయన చెప్పిన మాటలు అందరిపైనా పడింది. ఆటను ఆస్వాదించడంతోనే విజేతగా నిలిచాం. అని హర్మన్ అంది.
Womens World Cup : మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. అప్పుడు కపిల్.. ఇప్పుడు అమన్.. వీడియో వైరల్
ఇక ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ బ్యాటర్లు లారా, సునే ప్రమాదకరంగా మారినప్పుడు నేను షెఫాలీ వైపు చూశాను. ఆమెతో బౌలింగ్ చేయించాలని అనిపించింది. ఎందుకంటే ఆమె ఈ రోజు బ్యాటింగ్‌లోనూ రాణించింది. ఈ రోజు తనది అని నా మనసుకు అనిపించింది. దీంతో కనీసం ఒక్క ఓవర్‌ను అయినా ఆమెతో వేయించాలని అనుకున్నాను. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింగ్‌గా మారింది. అని హర్మన్ తెలిపింది.
ఇక షెఫాలీ జట్టులోకి వచ్చినప్పుడు కనీసం రెండు నుంచి మూడు ఓవర్లు వేసేందుకు సిద్ధంగా ఉండాలనే విషయాన్ని ఆమెతో చెప్పినట్లు హర్మన్ అంది. అయితే.. ఇందుకు షెఫాలీ మాత్రం కాదు.. అలా కాదు.. నువ్వు బంతిని ఇస్తే మాత్రం నేను 10 ఓవర్లు కూడా వేస్తాను అన్నట్లుగా వివరించింది. ఈ విజయంలో షెపాలీకి క్రెడిట్ ఇవ్వాలని అంది.
ఇక ఈ రోజు ఫైనల్ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ కొంచెంది భిన్నంగా ఉంది. దీంతో మేం చేసిన స్కోరు సరిపోతుందని భావించాం. ఇక ఫైనల్ అంటే ఎలాగూ కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఇక దక్షిణాఫ్రికా కూడా చాలా బాగా ఆడింది. ఆఖరిలో ఒత్తిడిని అధిగమించిన జట్టు విజేతగా నిలిచింది. దీప్తి శర్మ కీలక వికెట్లు తీసింది. విజేతగా నిలిచాం. అయితే.. ఇది ఆరంభం మాత్రమే.. తదుపరి ప్రణాళిక ఈ విజయాన్ని అలవాటు చేసుకుని ముందు ముందు మరిన్ని ట్రోఫీలు అందుకోవాలి. అని హర్మన్ అంది.
