దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మృతి వెనుక “ఆ ఇండియన్ డ్రగ్”?: పోలీసు అధికారి సంచలనం

ఆ ట్యాబ్లెట్లను అక్కడ నుంచి తీసేయాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలిపారు.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ థాయ్‌లాండ్‌లో 2022 ఏప్రిల్‌లో గుండెపోటుతో మృతి చెందారు. 52 ఏళ్లకే ఆయన మృతి చెందడం అప్పట్లో సంచలనమైంది. గుండెపోటు వల్లే ఆయన మృతి చెందారని అప్పట్లో ప్రకటించినప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ఓ పోలీసు అధికారి తాజాగా పలు కామెంట్లు చేశారు.

షేన్ వార్న్ మృతి వెనుక ఓ భారతీయ ఔషధం ఉండవచ్చని ఆ అధికారి అంటున్నారు. ఆ ఔషధం లైంగిక సామర్థ్యానికి సంబంధించిందని చెప్పారు. ఆ ఔషధ బాటిల్‌ ఘటనా స్థలంలో దొరికిందని చెప్పారు.

డైలీ మెయిల్ ప్రచురించిన వివరాల ప్రకారం.. షేన్ వార్న్‌ మృతి చెందిన సమయంలో ఘటనాస్థలి ఓ సీనియర్‌ పోలీసు అధికారి వెళ్లారు. ఆ అధికారి తాజాగా మీడియాతో మాట్లాడారు. షేన్ వార్న్ మృతి చెందిన చోట ఔషధ బాటిల్‌, వాంతులు, రక్తపు మరకలు కనపడ్డాయని చెప్పారు.

ఆ ట్యాబ్లెట్లను అక్కడ నుంచి తీసేయాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలిపారు. దీంతో వాటిని తీసేశామని, వాటిని షేన్ వార్న్‌ ఎంత డోసులో తీసుకున్నారో తెలియదని చెప్పారు. అప్పట్లో ఇది సెన్సిటివ్ విషయమని తెలిపారు. ఈ అంశాన్ని కప్పిపుచ్చడానికి ఆస్ట్రేలియా సీనియర్‌ అధికారులు ప్రయత్నించారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖుడు ఇటువంటి పరిస్థితుల్లో మృతి చెందాడన్న విషయం బయటకు రాకుండా వారు ఇలా చేసి ఉండవచ్చని అన్నారు. షేన్ వార్న్ మృతి అనంతరం సూరత్ థాని ఆసుపత్రిలో శవపరీక్ష చేశారు. షేన్ వార్న్‌ సహజ కారణాల వల్లే మృతి చెందాడని, ఏదో కుట్ర జరిగిందన్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.