Shreyas Iyer : ధోని, కోహ్లీ, రోహిత్ ఓడిపోలేదా? శ్రేయ‌స్ సోద‌రి కామెంట్స్ వైర‌ల్‌..

టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు (Shreyas Iyer) ఏదీ క‌లిసి రావ‌డం లేదు

Shresta Iyer backing Shreyas Iyer after 4 t20 matches loss

  • టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత గెలుపు రుచి చూడ‌ని శ్రేయ‌స్
  • అయ్య‌ర్ పై విమ‌ర్శ‌ల జ‌డివాన‌
  • త‌మ్ముడికి మ‌ద్ద‌తుగా నిలిచిన అక్క శ్రేష్ఠ‌

Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. భార‌త కెప్టెన్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు గెలుపు రుచి చూడ‌లేదు. ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌ల్లో అయ్య‌ర్ సార‌థ్యంలో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు ఓడిపోయింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. ఈ క్ర‌మంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

ఈ నేప‌థ్యంలో అయ్యర్‌కు ఆయన సోదరి శ్రేష్ఠ‌ మద్దతుగా నిలిచారు. అత‌డు భార‌త అత్యుత్త‌మ కెప్టెన్ల‌లో ఒక‌డిగా నిలుస్తాడ‌న్న ధీమాను వ్య‌క్తం చేసింది. కొన్ని ఓటముల ఆధారంగా శ్రేయస్ సామర్థ్యాన్ని అంచనా వేయడం సరైంది కాదని తెలిపింది.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌.. వైభ‌వ్ సూర్య‌వంశీ స్థానంలో సంజూ శాంస‌న్‌?

గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు కూడా పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి తమ ప్రతిభతో గొప్ప స్థాయికి చేరుకున్నారని గుర్తు చేసింది.  శ్రేయస్‌లో అసాధారణ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, భవిష్యత్తులో అతను భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందుతాడనే నమ్మకం తనకు ఉందని ఆమె చెప్పుకుంది. ఇప్పుడు విమ‌ర్శిస్తున్న వారే భ‌విష్య‌త్తులో అత‌డు గొప్ప సార‌థి అని ప్ర‌శంసిస్తార‌ని పేర్కొంది.

గురువారం బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగ‌నున్న నాలుగో టీ20 భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా త‌ప్ప‌కుండా విజ‌యం సాధించాల్సి ఉంది. ఓడిపోతే మాత్రం అయ్య‌ర్ సార‌థ్యంలో వ‌రుస‌గా రెండో సిరీస్ కోల్పోయిన‌ట్లు అవుతుంది.