Shubman Gill discharged from hospital, returns to team hotel
Shubman Gill : ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు స్వల్ప ఊరట లభించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం అతడు టీమ్ హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా గిల్ (Shubman Gill) మెడ పట్టుకున్న సంగతి తెలిసిందే.
కాగా.. మెడ గాయం నుంచి కోలుకుంటున్న అతడు విమాన ప్రయాణాలు చేయవద్దని, కనీసం అతడు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అతడి ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తోంది. ప్రస్తుతం గిల్ తన మెడను అటూ ఇటూ తిప్పగలుగుతున్నాడు. అయితే.. అతడు గౌహతి వేదికగా (నవంబర్ 22) శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఆడతాడో లేదో అన్న దానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.
గంగూలీ పరామర్శ..
ఇదిలా ఉంటే.. ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జి కావడానికి ముందు టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. గిల్‌ను పరామర్శించాడు. దాదాపు 15 నిమిషాల పాటు అతడితో మాట్లాడాడు.
తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ మెడ పట్టేసింది. వెంటనే ఫిజయో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి నొప్పి తగ్గలేదు. దీంతో అతడు రిటైర్డ్ ఔట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ తరువాత గిల్ మరోసారి మైదానంలోకి అడుగుపెట్టలేదు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు బ్యాటింగ్ చేయలేదు.