Shubman Gill overtakes Jasprit Bumrah after winning ICC Player of the Month for February
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. ఐసీసీ అందించే ఓ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గాను అతడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఈ అవార్డును అందుకున్న భారత క్రికెటర్‌గా గిల్ రికార్డులకు ఎక్కాడు.
ఫిబ్రవరి నెలలో గిల్ అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 259 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. టీమ్ఇండియా 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
ICC ODI Rankings : రోహిత్ శర్మ 2 అప్.. కోహ్లీ వన్ డౌన్.. కుల్దీప్ త్రీ అప్..
ఛాంపియన్స్ ట్రోఫీలోనూ గిల్ మంచి ప్రదర్శననే చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై 46 పరుగులు చేసిన గిల్, బంగ్లాదేశ్ పై ఏకంగా శతకం బాదాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అతడితో పాటు ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ లు కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. అయితే.. అత్యధిక ఓట్లతో గిల్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ అవార్డు గెలుచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని గిల్ అన్నాడు. బ్యాటింగ్‌లో రాణిస్తూ దేశం తరుపున మ్యాచ్‌లు గెలవడం కంటే తనకు ఇంకేమీ ప్రేరణ ఇవ్వదన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడం బాగుందని, భవిష్యత్‌లో టీమ్ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పాడు.
ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ను అత్యధిక సార్లు గెలిచిన ఆటగాడిగా..
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్గును గిల్ గెలుచుకోవడం ఇది మూడోసారి. 2023వ సంవత్సరంలో జనవరి, సెప్టెంబర్ నెలల్లో గిల్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు సార్లు ఈ పురస్కారాన్ని పొందాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను అందుకున్న భారత ప్లేయర్లు వీరే..
శుబ్‌మన్ గిల్ – మూడుసార్లు
జస్‌ప్రీత్ బుమ్రా – రెండుసార్లు
రిషభ్ పంత్ – ఒకసారి
రవిచంద్రన్ అశ్విన్ – ఒకసారి
భువనేశ్వర్ కుమార్ – ఒకసారి
శ్రేయస్ అయ్యర్ – ఒకసారి
విరాట్ కోహ్లి – ఒకసారి
యశస్వి జైస్వాల్ – ఒకసారి