Shubman Gill
Shubman Gill: ఐపీఎల్(IPL) 2023 సీజన్ ఫైనల్స్‌లో తలపడే జట్లు ఏవో తెలిసిపోయాయి. తమ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తలపడనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వరుసగా రెండో సారి టైటిల్ అందుకోవాలని హార్దిక్ సేన బావిస్తోండగా.. ఐదోసారి కప్పును ముద్దాడాలని ధోని నాయకత్వంలోని చెన్నై పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఓ ఘనతను అందుకోనున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు మహేంద్రసింగ్ ధోని(MS Dhoni) తప్ప ఎవరూ కూడా వరుసగా మూడు ఫైనల్స్ ఆడలేదు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుడు అయిన కర్ణ్ శర్మ వరుసగా మూడు ఫైనల్స్(2016,2017,2018) ఆడినప్పటికి తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. అయితే.. ధోని మాత్రం నాలుగు ఫైనల్స్(2010, 2011, 2012, 2013) లో ఆడాడు.
IPL2023: ముంబై చిత్తు.. ఫైనల్‌కు హార్ధిక్ సేన.. చెన్నైతో ఢీ కొట్టనున్న గుజరాత్
నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన రికార్డును అందుకోనున్నాడు. రేపు అతడు ఆడబోయేది వరుసగా మూడో ఫైనల్. 2011లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఫైనల్ ఆడిన గిల్ 51 పరుగులతో రాణించాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడి 45 పరుగులతో జట్టుకు కప్పును అందించాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న గిల్ ఫైనల్స్‌లో ఎలా ఆడతాడు అన్నదానిపైనే అందరి దృష్టి నెలకొన్నది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్ 60.79 సగటుతో 156.43 స్ట్రయిక్ రేట్‌తో 851 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. రేపటి ఫైనల్‌లో గనుక గిల్ మరో 123 పరుగులు చేస్తే 2016లో విరాట్ కోహ్లి చేసిన 973 పరుగుల రికార్డు బద్దలు కానుంది. అదే విధంగా ఒక సీజన్‌లో అత్యధిక శతకాల రికార్డును కూడా సమం కానుంది. విరాట్ కోహ్లి, జోస్ బట్లర్ లు ఒక సీజన్‌లో అత్యధికంగా నాలుగు శతకాలు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
IPL2023: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.. టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు..!