బెంగాల్ తరపున ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడాల‌ని సాహాను కోరిన సౌరవ్ గంగూలీ

వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. బెంగాల్ తరపున వీడ్కోలు మ్యాచ్ ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుకుంటున్నారు.

Sourav Ganguly: వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. బెంగాల్ తరపున వీడ్కోలు మ్యాచ్ ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుకుంటున్నారు. తన సొంత రాష్ట్రం కోసం “ఒక చివరి మ్యాచ్” ఆడాలని సాహాను గంగూలీ కోరినట్టు త్రిపుర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయంత డే వెల్లడించారు. దశాబ్దానికిపైగా బెంగాల్ రంజీ టీమ్‌కు సాహా ప్రాతినిథ్యం వహించాడు. బెంగాల్ రంజీ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2022లో త్రిపుర జట్టులో ప్లేయర్-కమ్-మెంటర్ పాత్రను చేపట్టాడు.

39 ఏళ్ల సాహా ఇటీవల కోల్‌కతాలో గంగూలీతో సమావేశమయ్యాడని జయంత డే తెలిపినట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. “బెంగాల్ తరపున సాహా రిటైర్ కావాలని గంగూలీ ఆకాంక్షించారు. చివరిగా కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని కోరారు. సాహా నాతో ఈ విషయం చెప్పాడు. కానీ అతను ఇంకా త్రిపుర నుంచి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) అడగలేద”ని జయంత డే వెల్లడించారు.

కాగా, తాజాగా ముగిసిన క్యాష్ రిచ్ లీగ్‌ ఐపీఎల్ 2024 ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన వృద్ధిమాన్ సాహా పెద్దగా రాణించలేకపోయాడు. 9 మ్యాచ్‌ల్లో 136 పరుగులు మాత్రమే చేశాడు. 2022 ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈసారి ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. 14 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది.

Also Read: రెండు నెల‌లు బ్ర‌ష్ చేసుకోలేక‌పోయా.. కారు ప్ర‌మాదం త‌రువాత ఏడు నెల‌లు న‌ర‌కం

కాగా, టీమిండియా టెస్టు జట్టులోనూ సాహాకు పూర్తిగా తలుపులు మూసుకుపోయాయి. యువ వికెట్ కీపర్ల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. సాహా భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు చివరిసారిగా 2021లో వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు.

Also Read: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్క‌ని చోటు.. ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన రింకూ సింగ్‌.. రోహిత్ ఇలా అన్నాడ‌ట‌..

ట్రెండింగ్ వార్తలు