South Africa coach Shukri Conrad comments after SA lost by 342 runs against England
SA vs ENG : వన్డే క్రికెట్ చరిత్రలోనే దక్షిణాఫ్రికా అత్యంత చిత్తుగా ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఓ జట్టు ఇంత తేడాతో ఓడిపోవడం వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా దక్షిణాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ గడ్డ పై 27 ఏళ్ల తరువాత సఫారీలు వన్డే సిరీస్ గెలవడం గమనార్హం.
సౌతాంప్టన్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు (SA vs ENG ) మూడో వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాకబ్ బెతెల్ (110; 82 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (100; 96 బంతుల్లో 6 ఫోర్లు) లు శతకాలతో చెలరేగారు. జోస్ బట్లర్ (62 నాటౌట్; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) జేమీ స్మిత్ (62; 48 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు అర్థశతకాలు బాదడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది.
అనంతరం 415 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఘోరంగా విఫలమైంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 20.5 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కార్బిన్ బాష్ (20), కేశవ్ మహారాజ్ (17), ట్రిస్టన్ స్టబ్స్(10) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రైడాన్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు.
342 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం పై దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ శుక్రీ కాన్రాడ్ స్పందించాడు. ఇది నిజంగా సిగ్గు చేటు అని అన్నాడు. సిరీస్ గెలిచామనే ఉదాసీనతే తమ ఓటమికి కారణం అని చెప్పుకొచ్చాడు.
ఈ ఘోర ఓటమికి ఏదైన సాకులు చెప్పడం మంచిది కాదు. మేము ఈ రోజు బాగా ఆడలేదు. అది నిజం. ఇంగ్లాండ్ వంటి అగ్రశేణి జట్టు పై సరిగ్గా ఆడకపోతే బలహీనతలు బయటపడతాయని కాన్రాడ్ అన్నాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఇలాగే జరిగిందన్నాడు. అప్పుడు కూడా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లాము. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకున్నాము. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఉదాసీనత ప్రదర్శించారు. ఆఖరి వన్డేలో 400 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు అని చెప్పాడు.
Sikander Raza : చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. కోహ్లీ, సూర్యకుమార్‌ను వెనక్కి నెట్టి..
సిరీస్‌ను గెలుచుకున్న తరువాత పేలవ ప్రదర్శన చేస్తున్నాము. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు ఈ ఓటమి కొంచెం ఇబ్బందికరంగానే ఉందన్నాడు. సిరీస్ గెలిచామని ఆటగాళ్లు ఉదాసీనత ప్రదర్శించారన్నాడు. ఫీల్డింగ్ కూడా తమ స్థాయికి తగ్గట్లుగా లేదన్నాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ పైనే ప్రస్తుతం ఫోకస్ పెడతామన్నాడు.