SRH vs KKR
IPL 2023, SRH vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) తో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కోల్‌కతా తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచుల్లో గెలిచింది. అటు సన్‌రైజర్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచుల్లో విజయం సాధించి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. దీంతో మ్యాచ్ హోరా హోరీగా జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడడం ఇది రెండో సారి. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్ విజయం సాధించింది.
బ్యాటింగ్ గాడిన పడితేనే
సన్‌రైజర్స్ బలం ఎప్పుడూ బౌలింగే. దీంతో బ్యాటింగ్ విభాగాన్ని బలపరుచుకునేందుకు మెగా వేలంగా రూ.13 కోట్లు వెచ్చించి హిట్టర్ హ్యారీ బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే.. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచులో మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో బ్రూక్ దారుణంగా విఫలం అయ్యాడు. కోల్‌కతాపైనే బ్రూక్ సెంచరీ సాధించడం గమనార్హం. రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను చేయలేకపోతున్నారు. అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌లు పర్వాలేనిపిస్తున్నారు. వీరితో పాటు క్లాసెన్ మరోసారి రాణిస్తే భారీ స్కోరును చేయడం కష్టం కాదు.
IPL 2023: కేకేఆర్ జట్టులోకి వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్..
పోయిన సీజన్ వరకు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు ఈ సారి విఫలం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్, నజరాజన్, మయాంక్ మార్కండేలు ఆడపాదడపా తప్పిస్తే నిలకడగా రాణించడంలో విపలం అవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ధారాళంగా పరుగులు ఇస్తుండడం కలవరానికి గురి చేస్తోంది. హార్ట్ హిట్టర్లు ఉన్న కోల్‌కతాను సన్‌రైజర్స్ బౌలర్లు ఎంత వరకు అడ్డుకుంటారు అన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
లిటన్ దాస్ స్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు
ఈ సీజన్ ఆరంభంలో మొదటి మూడు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి జోష్‌లో ఉన్నట్లు కనిపించింది కోల్‌కతా. అయితే.. ఒక్కసారిగా డీలా పడిపోయింది. చివరి ఆరు మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచులోనే విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలు ఫామ్‌లో ఉండడం కేకేఆర్‌కు కలిసివచ్చే అంశం. వీరితో పాటు రస్సెల్, రింకూ సింగ్‌లు రాణిస్తే బ్యాటింగ్‌లో తిరుగుఉండదు.
బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో విండీస్ కీపర్, బ్యాటర్ అయిన జాన్సన్ ఛార్లెస్‌ను తీసుకుంది. రూ.50లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. ఛార్లెస్ 2012, 2016 టీ20 ప్రపంచకప్ సాధించిన విండీస్ జట్టులో సభ్యుడు. ఇప్పటి వరకు అతడు 224 టీ20 మ్యాచుల్లో 5,600 పరుగులు సాధించాడు.
IPL 2023, KKR vs SRH: కోల్‌కతాపై సన్‌రైజర్స్ విజయం
పిచ్, వాతావరణం
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం వర్షాలు పడుతున్నాయి. అయితే నేడు వర్షం పడే అవకాశం తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తుది జట్ల (అంచనా) :
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు : మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, అకిల్ హోసేన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : జేసన్ రాయ్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జగదీశన్, వెంకటేష్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి