India vs Sri Lanka : 2, 0, 17, 0, 0, 4, 0, 8 ఇదేదో ఫోన్ నంబర్ అని అనుకునేరు. కానే కాదండోయ్. కొలంలోని ప్రేమదాస స్టేడియంలో టీమ్ఇండియాతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక బ్యాటర్ల చేసిన స్కోర్లు ఇవి. భారత బౌలర్ల ధాటికి ఒక్కరంటే ఒక్క లంక బ్యాటర్ కూడా క్రీజులో కుదురుకోలేకపోయారు. పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారత బౌలర్ల ధాటికి 15.2 ఓవర్లలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌటైంది. కాగా.. వన్డేల్లో భారతపై శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
లంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్ (17), దుషన్ హేమంత (13) లు మాత్రమే రెండు అంకెల స్కోర్ సాధించగా ఐదుగురు బ్యాటర్లు కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, డాసున్ శానక, మతీషా పతిరన లు డకౌట్లు అయ్యారు. మిగిలిన వారిలో పథుమ్ నిశాంక రెండు, ధనుంజయ డిసిల్వా నాలుగు, దునిత్ వెల్లలాగే ఎనిమిది, ప్రమోద్ మదుషన్ ఒక్క పరుగు చేశారు.
ఆరేసిన సిరాజ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకు ఏదీ కలిసి రాలేదు. ముఖ్యంగా సిరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి లంక జట్టును గట్టి దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే సిరాజ్ (6/21) వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్‌లో బెస్ట్ బౌలింగ్ కూడా ఇదే కావడం గమనార్హం.
Mohammed Siraj : చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. చమిందా వాస్ రికార్డు సమం