Jay Shah : జైషాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన శ్రీలంక ప్ర‌భుత్వం..! ఆ వ్యాఖ్య‌లే కార‌ణం..

Jay Shah-Arjuna Ranatunga : బీసీసీఐ కార్యదర్శి జైషా పై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా శ్రీలంక ప్ర‌భుత్వం జైషా కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

Jay Shah-Arjuna Ranatunga

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జైషా పై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా శ్రీలంక ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేశేఖ‌ర‌లు ఘ‌ట‌న పై విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం త‌రుపున జైషాకు క్ష‌మాప‌ణ‌లు తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

విజేశేఖ‌ర మాట్లాడుతూ.. లంక క్రికెట్ బోర్డులోని లోపాల‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ లేదంటే బ‌య‌టి వ్య‌క్తుల పై రుద్ద‌లేమ‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాదన్నారు. శ్రీలంక నిర్వాహ‌కుల‌దే పూర్తి బాధ్య‌త అని చెప్పారు. ఇక లంక క్రికెట్ పై విధించిన నిషేధాన్ని పరిష్కరించడానికి అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బిసిసిఐ కార్యదర్శి జైషాతో సంప్ర‌దింపులు ప్రారంభించార‌ని పర్యాటక మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు.

IND vs AUS World Cup final : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ రికార్డులు.. తుది జ‌ట్ల అంచ‌నా..

ఐసీసీ విధించిన నిషేదం ప్ర‌తికూల ప‌రిణాల‌మాల‌ను క‌లిగిస్తుంద‌ని, వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని చెప్పారు. నిషేదాన్ని ఎత్తివేయ‌కుంటే శ్రీలంక‌కు ఎవ‌రూ రార‌ని, ఆదాయం ప‌డిపోతుంద‌న్నారు.

ర‌ణ‌తుంగ ఏమ‌న్నాడంటే..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో శ్రీలంక పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. లీగు ద‌శ‌లో తొమ్మిది మ్యాచులు ఆడిన శ్రీలంక రెండు మ్యాచుల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో 7 మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచి సెమీస్ చేర‌కుండానే ఇంటి ముఖం ప‌ట్టింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్య‌వ‌ర్గాన్ని ఆ దేశ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. మాజీ కెప్టెన్ అర్జున ర‌ణ‌తుంగ నేతృత్వంలో ఏడుగురు స‌భ్యుల‌తో మ‌ధ్యంత‌ర క‌మిటీని నియ‌మించింది. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.

World Cup Final : ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌నున్న ప్ర‌ముఖులు వీరే..! టాలీవుడ్ నుంచి రామ్‌చ‌ర‌ణ్‌..

శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్ర‌భుత్వ జోక్యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఐసీసీ ఆ జ‌ట్టు స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసింది. దీనిపై అర్జున ర‌ణ‌తుంగ మాట్లాడుతూ శ్రీలంక క్రికెట్ దిగ‌జార‌డానికి కార‌ణం జైషా అంటూ ఆరోప‌ణ‌లు చేశాడు. భార‌త్‌లో ఉంటూనే లంక బోర్డును స‌ర్వ‌నాశనం చేశాడ‌ని అన్నారు.