సెంచరీల్లో కోహ్లీ సరసన స్మిత్.. టెస్టు పరుగుల్లోనూ అధిగమించాడు!

Steve Smith equals Virat Kohli’s tally with 27th Test hundred : ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో సెంచరీ సాధించిన మొదటి ఆసీస్ క్రికేటర్ గా స్మిత్ రికార్డు నెలకొల్పాడు. టీమిండియా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో స్మిత్‌ చోటు దక్కించుకున్నాడు. సిడ్నీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌‌ 226 బంతుల్లో 16 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు.

మిగతా ఆటగాళ్లు తేలిపోతున్నా స్మిత్‌ నిలకడగా ఒంటరి పోరాటం చేశాడు. క్రమంగా సెంచరీ నమోదు చేశాడు. తద్వారా స్మిత్ టెస్టుల్లో తన 27వ సెంచరీ పూర్తి చేసి.. టెస్టు సెంచరీల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సరసన చేరాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లి 70 సెంచరీలు చేయగా.. టెస్టుల్లో కోహ్లీ 27 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పుడు టెస్టు పరుగుల్లో కోహ్లిని స్మిత్‌ అధిగమించాడు. కోహ్లి ఇప్పటివరకూ 7,318 టెస్టు పరుగులు చేయగా.. స్మిత్‌ 7,368 పరుగులతో కోహ్లీని రికార్డును బ్రేక్ చేశాడు.

భారత్‌పై స్మిత్‌ 8వ టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 338 పరుగులకు ఆలౌటైంది. 166/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.