PIC: @BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా అతడు నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు ఆడాడు. 20 బంతుల్లో 34 పరుగులు బాదాడు.
వైభవ్ సూర్యవంశీపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సైతం సూర్యవంశీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. తాను ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆట తీరు చూసేందుకు నిద్ర లేచానని చెప్పారు. ఐపీఎల్‌లో సూర్యవంశీ అరంగేట్రం అద్భుతమని అన్నారు.
ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ స్పందిస్తూ.. 14 ఏళ్ల బాలుడి ఆట అద్భుతంగా, ఊహించని విధంగా ఉందని తెలిపారు. అతడు ఫస్ట్ బాల్‌ను ఆడిన తీరు, అతడి బ్యాట్ దూకుడుని చూడాల్సిందేనని పేర్కొన్నారు. అప్పట్లో యువకుడిగా ఉన్న రోజుల్లో యువరాజ్ సింగ్‌ను చూసినట్లు ఉందని చెప్పారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ.. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం అద్భుతమని, ఈ 14 ఏళ్ల బాలుడు కవర్స్ మీదుగా తొలి బాల్‌నే సిక్స్ కొట్టాడని చెప్పారు.
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష బోగ్లే స్పందిస్తూ.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చాలా ఆకట్టుకునేలా ఉందని చెప్పారు. అతడు బాగా ఆడగలడని అన్నారు.
Woke up to watch an 8th grader play in the IPL!!!! What a debut! https://t.co/KMR7TfnVmL
— Sundar Pichai (@sundarpichai) April 19, 2025