Sunil Gavaskar advice to Rohit Sharma ahead of Champions Trophy 2025 semifinal vs Australia
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ఇండియా దూసుకుపోతుంది. వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం దుబాయ్ వేదికగా జరగనున్న సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఓ సలహ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభాలపై మాత్రమే దృష్టి పెట్టడం సరికాదన్నాడు. ఓపికగా ఆడుతూ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాలని సూచించాడు.
‘తనదైన శైలిలో రోహిత్ శర్మ ఆడాలి. అతడు ఓపెనర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అతడు 10 ఓవర్లల్లో 40 నుంచి 45 పరుగులు చేస్తే సరిపోదు. అతడు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. అతడు ఎన్ని ఎక్కువ ఓవర్లు ఆడితే భారత జట్టుకు అంత ప్రయోజనం. అతడు ఎక్కువ ఓవర్లు ఆడితే భారత్ భారీ స్కోరు సాధిస్తుంది.’ అని ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ప్రదర్శన ఎలా ఉందంటే..
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కైల్ జామిసన్ వేసిన పుల్‌టాస్ బాల్‌ను భారీ షాట్‌కు యత్నించి 30 గజాల సర్కిల్ లోపల ఉన్న విల్‌యంగ్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో పరుగుల వేటను బాగా ప్రారంభించాడు. అయితే.. షాహీన్ అఫ్రిది ఇన్‌స్వింగ్ యార్కర్ తో హిట్‌మ్యాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో 36 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి 10వ ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. అతడు ఇన్నింగ్స్‌ల్లో ఏడు ఫోర్లు ఉన్నాయి.
తన బ్యాటింగ్ తీరును మార్చుకున్న రోహిత్..
గత కొన్నాళ్లుగా రోహిత్ శర్మ తన ఆట తీరును మార్చుకున్నాడు. పవర్ ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ వారి లయను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో 90 బంతుల్లో 119 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక సాధారణంగా దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. ఇక్కడ హిట్టింగ్ ఆడడం అంత సులభం కాదు. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ఎక్కువ వికెట్లు కోల్పోకుండా భారీ లక్ష్యాన్ని ఛేదించాలన్నా ఆసీస్‌తో రోహిత్ శర్మ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే ప్రయోజనం ఉంటుంది.
ఆస్ట్రేలియాతో చివరి వన్డే రోహిత్ ఎప్పుడు ఆడాడు..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై చివరి సారిగా రోహిత్ శర్మ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 31 బంతుల్లో 3 సిక్సర్లు 4 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. 10వ ఓవర్‌లో గ్లెన్‌మాక్స్ వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు.