Suryakumar Yadav clearing the way for Sanju Samson
Sanju Samson : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మూడు మ్యాచ్ లలో టీమిండియా ఘన విజయం సాధించగా.. వైజాగ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. అయితే, ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం రాత్రి జరగనుంది.
ఈనెల 31న తిరువనంతపురంలో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు కేరళ చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటపట్టించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.
విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో సంజూ శాంసన్‌కు బాడీగార్డుగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. తప్పుకోండి.. తప్పుకోండి.. దయచేసి దారివ్వండి.. అందరూ పక్కకు జరగండి సంజూ శాంసన్ వస్తున్నారు అంటూ సూర్య ఆటపట్టించాడు. సంజూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ముందుకు సాగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఎయిర్ పోర్టులో సూర్యకుమార్ యాదవ్ చేసిన పనికి సంజుతోపాటు పక్కన ఉన్న సిబ్బంది, సైతం నవ్వులు చిందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Make way for @IamSanjuSamson in 𝗚𝗼𝗱’𝘀 𝗼𝘄𝗻 𝗰𝗼𝘂𝗻𝘁𝗿𝘆 😉
🎥 Don’t miss this banter between friends Sanju Samson and Captain Surya Kumar Yadav 😄#TeamIndia | #INDvNZ | @IDFCFirstBank | @surya_14kumar pic.twitter.com/zBAFPmZJGk
— BCCI (@BCCI) January 30, 2026
ఇదిలాఉంటే.. సంజూ శాంసన్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ, అతను ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో పరుగుల రాబట్టడంలో విఫలమవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లలో తక్కువ పరుగులకే సంజూ ఔట్ కావటంతో తన బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజూ నాలుగు మ్యాచ్‌లలో 10, 6, 0, 24 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఈ సిరీస్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్‌తో సంజూ ప్లేస్‌ను భర్తీ చేయాలని చాలా మంది అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో శాంసన్ ఉంటాడా.. లేదంటే ఓపెనింగ్ జోడీలో మార్పులు చోటు చేసుకుంటాయా అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.