Suryakumar Yadav comments after India beat Pakistan in Asia cup 2025 super 4 stage
Suryakumar Yadav : ఆసియాకప్ 2025లో భారత్ అదరగొడుతోంది. సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది. బంతితో అనుకుంత రాణించకపోయినా, ఫీల్డింగ్ లో విఫలమైనా కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటింది. ఈ మెగాటోర్నీలో పాక్ పై రెండో సారి గెలుపును అందుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. సాహిబ్జాదా ఫర్హాన్ (58; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో శివమ్ దూబె రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత అభిషేక్ శర్మ (74; 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (47; 28 బంతుల్లో 8 ఫోర్లు) మెరుపులు మెరిపించగా తిలక్ శర్మ (30; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
కాగా.. పాక్‌పై విజయం సాధించడం పై టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. శివమ్ దూబె అద్భుతమైన బౌలింగ్‌తో తమను గట్టెక్కించాడని చెప్పుకొచ్చాడు. పాక్ భారీ స్కోరు సాధించకుండా అడ్డుపడ్డాడని తెలిపాడు. ఇక అభిషేక్, గిల్ ప్రశంసించాడు. వారిది ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ అని అన్నాడు.
‘ప్రతి మ్యాచ్‌లోనూ ప్లేయర్లు బాధ్యత తీసుకుని చాలా బాగా ఆడుతున్నారు. దీంతో ఓ కెప్టెన్‌గా నా పని చాలా సులభం అవుతోంది. కుర్రాళ్లు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. బౌలింగ్ చేసే సమయంలో తొలి 10 ఓవర్లు కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు.’అని సూర్య అన్నాడు.
డ్రింక్స్ బ్రేక్ సమయంలో తాను ఒక్కటే విషయం చెప్పానన్నాడు. ఆట ఇప్పుడే మొదలైందని అన్నట్లుగా తెలిపాడు. ఇక బుమ్రా వైఫల్యం గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నాడు. అతడు రోబో కాదని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక చెడు రోజు ఉంటుందన్నాడు.
India vs Oman : సంజూ శాంసన్ తప్పించుకున్నాడు.. హార్దిక్ బలి అయ్యాడు.. వీడియో వైరల్..
ఇక ఈ మ్యాచ్‌లో క్లిష్ట సమయంలో దూబె అద్భుతంగా బంతులు వేసి రక్షించాడన్నాడు. ఇక శుభ్‌మన్ గిల్, అభిషేక్ మధ్య మంచి బాండింగ్ ఉందన్నాడు. ఒకరికొకరు చాలా బాగా సహకరించుకుంటారన్నాడు. వారిది ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలివేసిన ఆటగాళ్లకు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఇప్పటికే మెయిల్స్ పంపినట్లుగా సూర్య తెలిపాడు.
భారత జట్టు బుధవారం (సెప్టెంబర్ 24న) బంగ్లాదేశ్‌తో తలపడనుంది.