Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణం అని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. కాగా.. గత 13 సీజన్లుగా ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో గెలవలేదు.
ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ (31), సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు సాధించాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం రచిన్ రవీంద్ర (65 నాటౌట్; 45 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో లక్ష్యాన్ని చెన్నై 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బౌలర్లలో విఘ్నేష్ పుత్తూరు మూడు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, విల్ జాక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
కాగా.. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము 15 నుంచి 20 పరుగులు తక్కువగా చేశామని చెప్పాడు. అయినప్పటికి బౌలర్లు అసాధారణంగా పోరాడారు అని కొనియాడాడు. విఘ్నేష్ ప్రదర్శన అద్భుతం. ప్రతిభ కలిగిన యువకులకు ముంబై ఎప్పుడూ అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ముంబై స్కౌట్స్ 10 నెలల కష్టానికి ప్రతిఫలం విఘ్నేష్ అని అన్నాడు.
MS Dhoni : రిటైర్‌మెంట్ పై మౌనం వీడిన ధోని.. వీల్‌ఛైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..
ఆట చివరి వరకు వెలుతుందనే అతడికి ఓ ఓవర్ ఇవ్వకుండా ఆపాను. అయితే.. అతడికి 18వ ఓవర్ ఇవ్వడం సబబు కాదనిపించింది. మంచు ప్రభావం లేదుగానీ, పిచ్ స్టిక్కీగా ఉంది. రుతురాజ్ అసాధారణ బ్యాటింగ్ వల్ల మా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. ఇది సుదీర్ఘ టోర్నీ కావడంతో బలంగా పుంజుకుని తిరిగి వస్తాం అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.