Suryakumar Yadav Fitness Update Ahead Of Asia Cup 2025
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి మరో నెలరోజుల సమయం కూడా లేదు. అయితే.. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది.
రెండు నెలల క్రితం సూర్య హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో పునరావాసంలో ఉన్నాడు. ఇటీవలే అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
కాగా.. ఎన్‌సీఏ వైద్యబృందం సూర్యను పరీక్షించింది. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని వైద్య బృందం తెలిపినట్లు కథనాలు వస్తున్నాయి. మరో 10 రోజుల్లో అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. సూర్య ఫిట్‌నెస్ విషయంలో ఓ స్పష్టత వచ్చిన తరువాతనే టీమ్‌ను ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ సూర్య ఆసియా కప్‌కు దూరం అయితే.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగొచ్చు.
చివరి సారిగా సూర్య.. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడాడు. ఈ సీజన్‌లో 717 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 తరువాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడంతో సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు తన నాయకత్వంలో భారత్ 22 మ్యాచ్‌లు ఆడగా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్య కెప్టెన్‌గా ఉండనున్నాడు.
14న పాకిస్తాన్?.
ఆసియా కప్ 2025లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్లు మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది.