Taniparthi Chikitha
Taniparthi Chikitha : కెనడాలోని వినిపెంగ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆర్చర్ తనిపర్తి చికిత అదరగొట్టింది. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా పరిగణించే ఈ పోటీల్లో చికిత కాంపౌండ్ అండర్ -21 విమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్లో యెరిన్ పార్క్ (కొరియా), సెమీస్‌లో ఫౌలా డయాజ్ (స్పెయిన్), క్వార్టర్స్‌లో పర్ణీత్ కౌర్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులను మట్టి కరిపించి స్వర్ణ విజేతగా చికిత నిలిచింది.
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత.. చిన్నతనం నుంచి ఆర్చరీలో అంచెలంచెలుగా ఎదిగేందుకు ఎంతో శ్రమించింది. స్వర్ణ విజేతగా నిలిచిన తరువాత చికిత మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు డిఫరెంట్ ఛాలెంజ్.. నేను దానిని అధిగమించి బంగారు పతకం సాధించగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. అయితే, ఈ పోటీకి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
విమానయాన సిబ్బంది సమ్మె కారణంగా పోటీలకు కొన్ని గంటల ముందు చికిత బృందం కెనడా చేరుకుంది. అంటే.. కేవలం ఆరు గంటల ముందే వారు కెనడాకు చేరుకున్నారు. ప్రయాణ బడలిక తీరకముందే పోటీల్లో బరిలోకి దిగాల్సి వచ్చింది. అయినా అద్భుత ప్రదర్శనతో అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. దీని గురించి విజయం అనంతరం చికిత మాట్లాడుతూ.. ఇది ఒకరకమైన సమస్య. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్ షిప్‌కు ముందు ఇది జరిగింది. కానీ, నేను ఏకాగ్రతతో ఆడాను. తద్వారా అనుకున్నది సాధించగలిగానని చెప్పారు.
2020 నుంచి తనకు మద్దతుగా నిలుస్తూ అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలు నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని చికిత పేర్కొంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఆసియా ఛాంపియన్ షిప్, ఆసియా క్రీడలపై చికిత దృష్టిసారించింది. 2028 సంవత్సరంలో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా చికిత ముందుకు సాగుతుంది.
ఎక్కడో సుల్తాన్‌పూర్‌లో మొదలుపెట్టి కెనడాలో అత్యున్నత శిఖరాలను అందుకోవడం వరకు సాగిన చికిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ప్రపంచ విజేతగా నిలవడానికి తొలి అడుగు వారి గ్రామంలోనే పడింది. తాను సాధించలేనిది తన కూతురు సాధించాలని ఆశపడ్డ శ్రీనివాసరావు.. చికితకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆర్చరీ నేర్పించాలని భావించాడు. కానీ, వారి గ్రామంలో ఆర్చరీకి సంబంధించి ఎలాంటి వసతులు లేవు. అయినా, శ్రీనివాసరావు నిరాశ చెందకుండా.. చికితకు ఏకాగ్రత కోసం యోగా, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కరాటే నేర్పించాడు. కొన్నాళ్ల తరువాత గ్రామంలోని తమ పొలంలోనే ఆర్చరీ సాధనకు శ్రీకారం చుట్టారు. వరి కోతలయ్యాక మిగిలిన గడ్డివామునే లక్ష్యంగా చికితతో తన తండ్రి శ్రీనివాసరావు ప్రాక్టీస్ చేయించాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆకట్టుకున్న చికిత.. రెండేళ్లలోనే జాతీయ స్థాయికి చేరుకుంది. జాతీయ సబ్ జూనియర్ ఆర్చరీలో వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్‌డ్ టీంలో కాంస్యం కైవసం చేసుకుంది.
♦ 2022లో సోనీపత్‌లోని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఆర్చరీ అకాడమీలో చోటు లభించడం చికిత కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది.
♦ అక్కడి కోచ్‌లు, మెంటార్‌లు మరింతగా ఆమెకు శిక్షణ ఇచ్చారు.
♦ 2023 గోవా జాతీయ క్రీడల్లో చికిత స్వర్ణం సాధించింది.
♦ 2023 జాతీయ సీనియర్ ఆర్చరీలో రెండు రజతాలు, జాతీయ జూనియర్ టోర్నీలో రెండు కాంస్య పతకాలు సాధించింది.
♦ షాంఘైలో జరిగిన టోర్నీలో టీమ్ విభాగంలో రజత పతకం దక్కించుకుంది.
♦ ఆసియా గ్రాండ్‌ప్రీలో టీమ్ విభాగంలో కాంస్యం సాధించింది. వ్యక్తిగత కేటగిరీలో నాల్గో స్థానంలో నిలిచింది.
♦ ప్రస్తుతం కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్ షిప్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన చికిత.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.