Rahul Dravid
Rahul Dravid contract expires : మూడోసారి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని భావించిన భారత్‌కు నిరాశ తప్పలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో 12 ఏళ్ల తరువాత ట్రోఫీని ముద్దాడాలనే కల కలగానే మిగిలిపోయింది. ఇదే సమయంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో ద్రవిడ్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం వన్డే ప్రపంచకప్ 2023 పూర్తికావడంతోనే ముగిసింది.
భారత హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండు సంవత్సరాలు పాటు పని చేశాడు. అతడి హయాంలో భారత జట్టు ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లలో టీమ్ఇండియా ఓడిపోయింది. ఈ క్రమంలో అతడిపై వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇదే విషయమై రాహుల్ ద్రవిడ్‌కు ప్రశ్న ఎదురైంది. టీమ్ఇండియాకు ఒక్క ఫార్మాట్‌లోనైనా కోచ్‌గా వ్యవహరించాలనే ప్రతిపాదన వస్తే అంగీకరిస్తారా..? అని అడిగారు.
Best Fielder Award : ఓటమి బాధలోనూ బెస్ట్ ఫీల్డర్ అవార్డు.. ఎవరికి ఇచ్చారో తెలుసా..?
భవిష్యత్తులో ఏం జరుగుతుందో..?
దాని గురించి ఆలోచించలేదని ద్రవిడ్ చెప్పాడు. ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ పైనే పూర్తి దృష్టి సారించినట్లు తెలిపాడు. ‘మెగాటోర్నీపైనే దృష్టి సారిచాను. అంతేగానీ ఇంకా దేనిపైన దృష్టి పెట్టలేదు. నా మనసులో ఎటువంటి ఆలోచనలు లేవు. ఒకవేళ సమయం దొరికి ఉంటే దీని గురించి ఆలోచించేవాడిని. ఇక నా రెండేళ్ల పని తీరుపై బయట నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇలాంటి జట్టుతో కలిసి పని చేసినందుకు ఎంతో గర్వపడుతున్నా. అన్ని ఫార్మాట్ల ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఇక నా పని తీరును నేనే స్వయంగా విశ్లేషించుకుంటా. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు.’అని ద్రవిడ్ అన్నాడు.
వారిని అలా చూడడం బాధగా ఉంది..
రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. మెగాటోర్నీలో టీమ్ఇండియాను చాలా బాగా నడిపించాడన్నారు. గ్రౌండ్‌లోనే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోనూ ఆటగాళ్లలో ఉత్తేజం నింపాడన్నారు. ప్రతీ మ్యాచ్‌కు ప్లానింగ్ ఉంటుందన్నాడు. ఇక ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ తీవ్ర నిరుత్సాహానికి లోనైందన్నారు. ఆటగాళ్లను ఇలా చూడడం చాలా బాధగా ఉందన్నాడు. ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని ద్రవిడ్ తెలిపారు.
కొత్త కోచ్ వస్తాడా..?
ద్రవిడ్ కాంట్రాక్టు కాలం ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్‌ను నియమిస్తుందా..? లేదా అతడినే కొనసాగిస్తుందా..? అన్న విషయాలను చూడాల్సిందే. అయితే.. అందుకున్న వార్తల ప్రకారం ద్రవిడ్ పై వేటు తప్పదని తెలుస్తోంది. అతడి స్థానంలో మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరీ బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.